సత్ఫలితాలను ఇచ్చిన ప్రత్యేక శిక్షణలు
మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి
గుంటూరు :ఎస్ఎస్సీ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఎస్సీ గురుకులాలకు
చెందిన విద్యార్థులు 75.17% శాతం ఫలితాలను సాధించారని రాష్ట్ర సాంఘిక
సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఫలితాలతో కలిపి
పదవ తరగతిలో ఎస్సీ గురుకులాల విద్యార్థుల ఉత్తీర్ణత 94.97% శాతానికి
పెరిగిందని వివరించారు. ఎస్ఎస్సీ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు
వెలువడిన నేపథ్యంలో శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నాగార్జున
గురుకుల విద్యార్థుల పదో తరగతి ఫలితాల తీరును తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ
ఏడాది 13,734 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయగా వారిలో 11033 మంది
విద్యార్థులు గత ఏప్రిల్ లో ఉత్తీర్ణులైయ్యారని చెప్పారు. ఏప్రిల్ లో వెలువడిన
ఫలితాల్లో గురకుల విద్యార్థులలో 80.33% శాతం మంది మాత్రమే పాస్ కావడం
జరిగిందన్నారు. అయితే ఫెయిల్ అయిన విద్యార్థులలో పలువురు సింగిల్
సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు గుర్తించామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఫెయిల్
అయిన విద్యార్థులకు ప్రత్యేకంగా ట్యూటర్లను పెట్టి ఆయా సబ్జెక్టుల్లో
ఉత్తీర్ణులైయ్యేలా ప్రత్యేకంగా బాలురు, బాలికలకు శిక్షణా శిబిరాలను ఏర్పాటు
చేసి శిక్షణ ఇప్పించామని వివరించారు. గురుకుల అధికారులు ఈ శిక్షణా
కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పటిష్టంగా పర్యవేక్షించారని
తెలిపారు. దీని ఫలితంగానే శుక్రవారం ఫలితాలు వెలువడిన ఎస్ఎస్సీ అడ్వాన్స్ డ్
సప్లిమెంటరీ పరీక్షలలో ఉత్తమ ఫలితాలను సాధించారని చెప్పారు. రాష్ట్ర
వ్యాప్తంగా తమ గురుకులాల నుంచి 2674 మంది విద్యార్థులు ఎస్ఎస్సీ అడ్వాన్స్ డ్
సప్లిమెంటరీ పరీక్షలు రాయగా వారిలో 2010 మంది ఉత్తీర్ణులై సగటున 75.17% శాతం
ఉత్తీర్ణతను సాధించారని నాగార్జున వెల్లడించారు. ఈ ఫలితాలతో గురుకులాల నుంచి
పదవ తరగతి పరీక్షలు రాసిన మొత్తం 13734 మంది విద్యార్థులలో 13043 మంది
ఉత్తీర్ణులు కావడంతో పదో తరగతి ఉత్తీర్ణతా శాతం 80.33% నుంచి 94.97%కు
పెరిగిందని చెప్పారు. జిల్లాల వారీగా చూస్తే 98.26% శాతం ఫలితాలతో ప్రకాశం
జిల్లా ప్రధమ స్థానంలో ఉండగా, 97%శాతం ఫలితాలతో శ్రీకాకుళం, కడప, అనంతపురం
జిల్లాలు ద్వితీయ స్థానంలోనూ, 95% ఫలితాలతో తూర్పుగోదావరి జిల్లా
తృతీయస్థానంలో ఉందని విపులీకరించారు. గురుకుల విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తమ
ఫలితాలు సాధించడానికి కృషిచేసిన గురకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్.
పావనమూర్తి, ఏఎంఓ ఎన్.సంజీవరావు, ఇతర ఉపాధ్యాయులను మంత్రి నాగార్జున
అభినందించారు.