పాట్నాలో విపక్షాలు భేటీ అయ్యాయి. 15కి పైగా పార్టీలు ఈ సమావేశానికి
హాజరయ్యాయి. బీహార్ సీఎం నితీశ్ కుమార్ నిర్వహిస్తున్న ఈ సమావేశానికి పశ్చిమ
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్
సీఎం భగవంత్ సింగ్ మాన్, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, తమిళనాడు
ముఖ్యమంత్రి స్టాలిన్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ
అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే,
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్
అబ్దుల్లా, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ఉత్తరప్రదేశ్ మాజీ
ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.
అధికార బీజేపీని అంతు చూసేందుకు ఒక్కటవుతున్న ప్రతిపక్షాల నేతలు
సమావేశమయ్యారు. పలువురు నేతలు బీహార్ రాజధాని పాట్నా చేరుకున్నారు. 2024
లోక్‌సభ ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. బీహార్
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈ సమావేశానికి నాయకత్వం వహిస్తున్నారు. కాంగ్రెస్,
తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన
(ఉద్ధవ్ థాకరే), డీఎంకే, జేఎంఎం, సమాజ్‌వాదీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్,
పీడీపీ, సీపీఐ, సీపీఎం, జేడీయూ, ఆర్జేడీ పార్టీలు సమావేశానికి హాజరయ్యాయి.
అయితే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఓ మెలిక పెట్టింది. ఉద్యోగుల నియామకాలు,
బదిలీలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సు విషయంలో కాంగ్రెస్ తమకు మద్దతుగా
నిలవకపోతే ప్రతిపక్షాల సమావేశాన్ని బహిష్కరిస్తామని ఆప్ హెచ్చరించింది. కాగా,
ప్రతిపక్షాల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ,
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విమానాశ్రయంలో
సాదర స్వాగతం పలికారు.