కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్
బెంగుళూరు : తెలంగాణాలో అందరు కలిసి పని చేస్తే కర్ణాటకలో మాదిరి కాంగ్రెస్
ప్రభుత్వం వచ్చి తీరుతుందని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.
బెంగళూరులో మర్యాద పూర్వకంగా డీకే శివకుమార్‌ను కలిసిన ఎంపీ కోమటిరెడ్డి
వెంకటరెడ్డితో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టికెట్లు పంపిణీ, సర్వేలు, గెలుపు
గుర్రాల ఎంపిక, షర్మిల పార్టీలో చేరడం తదితర అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన వేళ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా
హస్తం పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకూమార్తోభేటీ అయ్యారు. తెలంగాణలో నాయకులందరూ
కలిసి పని చేస్తే కర్ణాటక రాష్ట్రంలో మాదిరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి
తీరుతుందని డీకే శివకుమార్ ఈ భేటీలో అభిప్రాయపడ్డారు. డీకే శివకుమార్‌ను
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి అనిరుద్ద్
రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ మధ్యాహ్నం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
బెంగుళూరులో డీకే శివకుమార్‌ను కలిసిన సందర్భంగా వారి మధ్య దాదాపు 45
నిముషాలుపాటు తెలంగాణలోని తాజా రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా టిక్కెట్లు, సర్వేలు, గెలుపుగుర్రాలు ఎంపిక, షర్మిళ కాంగ్రెస్
పార్టీలోకి చేర్చుకోవడం తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.
షర్మిళకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకో సంబంధం లేనట్లు చూడొద్దని, అలాగే ఆమెను
వైఎస్సార్ బిడ్డగా, తెలంగాణ కోడలిగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలని డీకే
శివకుమార్ సూచించినట్లు తెలుస్తోంది. కర్ణాటకలో అభ్యర్ధులు ఎంపిక విషయంలో
ఒక్కో అభ్యర్ధిపై మూడు మార్లు సర్వేలు చేయించిన తరువాతనే అభ్యర్ధుల జాబితా
ప్రకటించారన్నారు. టికెట్లు కేటాయింపు విషయంలో ప్రజాబలం లేని నాయకుడు
ఎంతటివారైనా ఇవ్వలేదని డీకే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా నాయకుల
మధ్య విభేదాలు కూడా పక్కన పెట్టి ప్రజల్లోనే ఉండాలని, తద్వారా కాంగ్రెస్
పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నట్లు డీకే శివకుమార్
అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి
తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్‌పై విశ్వాసం పెరుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర
వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్‌రావు ఠాక్రే పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు
కాంగ్రెస్ పక్షాన నిలుస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం
ఏర్పడకుండా ఎవరూ అడ్డుకోలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఢిల్లీలో
జరిగిన కాంగ్రెస్ పార్టీసమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్
నేతలు.. బీజేపీ నేతలను కలుస్తున్నారని మాణిక్‌రావు ఠాక్రే పేర్కొన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య అంతర్గత వ్యవహారం నడుస్తోందని ఆరోపించారు.
అందుకే వారిరువురు కూటమిని ఏర్పాటు చేసుకోవడానికి కృషి చేస్తున్నారనే
ఊహాగానాలు తమకు వస్తున్నాయని అన్నారు. తెలంగాణ సమస్యలపైనే బీజేపీ నేతలను
కలిసినట్లుగా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని, కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం
అందుకు భిన్నంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.