విజయవాడ : రాష్ట్రంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వారాహి యాత్ర
విజయవంతం కావడంతో తాడేపల్లి పెద్దల మైండ్ బ్లాంక్ అయ్యిందని జనసేన రాష్ట్ర
అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ
వారాహి దెబ్బకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మతి భ్రమించి
మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ వాస్తవాలు చెప్పారు కాబట్టే
ఆయనపై నిందలు వేస్తున్నారన్నారు. ‘‘మీకు దమ్ముంటే మా అధినేత అడిగిన వాటికి
సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. ఉద్యోగాలు లేవని, రాజధాని లేదని, మద్యం ఏరులై
పారుతుందని వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 17 పధకాలు రద్దు చేశారని, దళితులకు 27
పధకాలు దూరం చేశారని మండిపడ్డారు. బాబాయి వివేకానంద రెడ్డిని హత్య చేయించి ఆ
రక్తపు మరకలు కడగాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. గంజాయి రవాణాకు ఏపీ
కేరాఫ్ అడ్రస్ అంటే ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కొబ్బరికి తెల్ల తెగులు
ఎలా సోకుతుందో, ఏపీకి వైసీపీ తెగులు సోకిందని పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు.