విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న సురక్ష’
కార్యక్రమం సామాన్య, పేద కుటుంబాలకు రక్ష అని ప్లానింగ్ ఉపాధ్యక్షులు,
సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. రాజీవ్ నగర్లోని కమ్యూనిటీ హాల్
నందు జగనన్న సురక్ష కార్యక్రమ నిర్వహణ, విధి విధానాలపై శనివారం సచివాలయ
సిబ్బంది, గృహ సారథులు, కన్వీనర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ
కార్పొరేటర్లు యరగొర్ల తిరుపతమ్మ, మోదుగుల తిరుపతమ్మతో కలిసి ఎమ్మెల్యే
పాల్గొన్నారు. అనంతరం సభనుద్దేశించి ప్రసంగించారు. ‘జగనన్నకు చెబుదాం’కు
అనుబంధంగా ‘జగనన్న సురక్ష’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్లు
మల్లాది విష్ణు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జూలై మాసం అత్యంత కీలకమని
వెల్లడించారు. శాచ్యురేషన్ పద్ధతిలో అర్హత గల ప్రతిఒక్కరికీ లబ్ధి చేకూర్చడం
ద్వారా ఈ ప్రభుత్వం నగరాలు, పట్టణాలలో 84 శాతం మంది ప్రజలకు మేలు చేకూర్చిందని
మల్లాది విష్ణు పేర్కొన్నారు. టెక్నికల్ సమస్యలు, ఇతర కారణాల ద్వారా
మిగిలిపోయిన 16 శాతం మందికి కూడా లబ్ధి చేకూర్చడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని
తెలియజేశారు. కనుక ప్రతి క్లస్టర్ ను ఒక యూనిట్ తీసుకుని వాలంటీర్లు, సచివాలయ
కార్యదర్శులు, గృహసారధులు, కన్వీనర్లు.. ప్రతి గడపకు వెళ్లాలని మల్లాది విష్ణు
సూచించారు. ఒక్కో కుటుంబం వద్ద కనీసం 10 నుంచి 15 నిమిషాల సమయం కేటాయించి
అభిప్రాయాలను సేకరించాలన్నారు. 63వ డివిజన్లోని 6 సచివాలయాల పరిధిలో 82
క్లస్టర్లు ఉండగా.. 64వ డివిజన్లోని 5 సచివాలయాల పరిధిలో 80 క్లస్టర్లు
ఉన్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఆయా సచివాలయాల పరిధిలో ప్రభుత్వ సంక్షేమ
పథకాలకు మిగిలిన అర్హులు, సమస్యలను యంత్రాంగం గుర్తించేలా స్పష్టమైన కార్యాచరణ
రూపొందించడం జరిగిందన్నారు. కనుక క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా సర్వే నిర్వహించి
అందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్
సృజనా, సీడీఓ జగదీశ్వరి, నాయకులు మోదుగుల గణేష్, సీహెచ్ రవి, ఇస్మాయిల్, మేడా
రమేష్, జిల్లేల్ల శివ, సచివాలయ సిబ్బంది, కన్వీనర్లు, గృహసారథులు పాల్గొన్నారు.