బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
నాగర్‌కర్నూలు : మోడీ పాలనలో దేశం పురోగమిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు
జేపీ నడ్డా అన్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఆదివారం సాయంత్రం
నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ నవసంకల్ప సభలో నడ్డా ముఖ్యఅతిథిగా
పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన వారికి
నివాళులర్పించారు. తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని
స్పష్టం చేశారు. తొమ్మిదేళ్ల మోడీ పాలనలో బడుగు, బలహీనవర్గాల అభివృద్ధికి
అనేక చర్యలు చేపట్టారని వివరించారు. తెలంగాణలో మాత్రం అన్ని వర్గాల ప్రజలు
దుఃఖంలో ఉన్నారని, కేసీఆర్, ఆయన కుమారుడు, కుమార్తె మాత్రమే సంతోషంగా
ఉన్నారని విమర్శించారు. ‘‘మోడీ ప్రభుత్వం 80 కోట్ల మంది ప్రజలకు రేషన్
అందిస్తోంది. ప్రధాని మోదీ ప్రభుత్వం పేదలకు అంకితం. మోదీ అధికారంలోకి వచ్చాక
పేదరికం 10శాతానికి పడిపోయింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మోదీ 4కోట్ల
మందికి ఇళ్లు నిర్మించారు. కమల వికాసంతోనే తెలంగాణలో అభివృధ్ధి సాధ్యం. పీఎం
కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు ఏటా రూ.6వేలు అందిస్తున్నాం. కొవిడ్,
ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఐటీ,
ఆటోమొబైల్ సహా అన్ని రంగాల్లోనూ భారత్ దూసుకెళ్తోంది. మోడీని గ్లోబల్
లీడర్‌గా ప్రపంచమంతా కొనియాడుతోంది. మోడీ చేపట్టిన సంస్కరణలతో దేశం అన్ని
రంగాల్లోనూ అభివృద్ధి చెందింది’’ అని నడ్డా వివరించారు.
అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తాం : రాష్ట్రంలోని రైల్వే
ప్రాజెక్టులకు మోడీ ప్రభుత్వం రూ.4,400 కోట్లు మంజూరు చేసిందన్న జేపీ నడ్డా
తెలంగాణ కోసం మెగా టెక్స్టైల్స్ పార్కును మోడీ ఇచ్చారన్నారు.
సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్‌ను మోడీ ప్రారంభించారని గుర్తు
చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, రాష్ట్రంలో ఇండస్ట్రియల్
కారిడారర్లు మోడీ చలవేననిపేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే
భారాస పోర్టల్, ధరణి పోర్టల్ బంద్ చేస్తామన్నారు. మోడీ ని వ్యతిరేకించే
పార్టీలన్నీ ఏకమయ్యాయన్న జేపీ నడ్డా పట్నాలో జరిగింది అవినీతి, కుల, కుటుంబ
పార్టీల ఫొటో సెషన్ అని ఎద్దేవా చేశారు. తెరాసను భారాస అని పేరు మాత్రమే
మార్చారు. భారాస అంటే భ్రష్టాచార రాక్షసుల సమితి అని వ్యాఖ్యానించారు.