దీపావళి సెలవు కోసం రెండు దశాబ్దాలుగా పోరాడుతున్న అసెంబ్లీ సభ్యురాలు జెనిఫెర్
గవర్నర్ సంతకం చేయడమే ఆలస్యం
మన దేశంలోనే కాదు. ఇకపై అమెరికాలోని న్యూయార్క్ లోనూ పాఠశాలలకు దీపావళి సెలవు
ఇవ్వనున్నారు. ఈ మేరకు నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రకటించారు. దీపావళి రోజున
స్కూళ్లకు సెలవు ప్రకటించే చట్టంలో భాగమైనందుకు గర్విస్తున్నట్టు చెప్పారు.
నగరంలోని స్కూళ్లకు దీపావళి రోజున సెలవు ఇవ్వాల్సిందేనంటూ న్యూయార్క్ అసెంబ్లీ
సభ్యురాలు జెనిఫెర్ రాజ్‌కుమార్ చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. రెండు
దశాబ్దాల తన పోరాటం తర్వాత ఈ విషయంలో విజయం సాధించినందుకు ఆనందంగా ఉందని ఆమె
పేర్కొన్నారు. స్కూళ్లకు దీపావళి సెలవు ప్రకటించినా అది ఈ ఏడాది మాత్రం
అందుబాటులో ఉండదు. 2023-24 స్కూల్ కేలండర్ ఇప్పటికే రూపొందడంతో వచ్చే ఏడాది
నుంచి పిల్లలకు దీపావళి సెలవు అందుబాటులోకి వస్తుంది. గవర్నర్ కేథీ హోచల్ ఈ
బిల్లుపై సంతకం చేసిన అనంతరం దీపావళి సెలవు అధికారికం అవుతుంది