కనీస వసతులు కూడా సమకూర్చని దుస్థితి
చంద్రబాబునాయుడు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
వైద్య ఆరోగ్య శాఖను నిర్వీరం చేసిన పాపం బాబుదే
రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినట్లుగా బాబు మాటలు
ప్రజలపై కపటప్రేమ నటిస్తూ మాయమాటలు
బాబు మాటలను ప్రజలు నమ్మరు
వైద్య ఆరోగ్యశాఖను పూర్తిగా ప్రక్షాళన చేసింది జగనన్నే
రాష్ట్రంలోని ఆస్పత్రుల స్వరూపాన్నే మార్చేశాం
సరిపడా సిబ్బంది, మందులు, వసతులతో కార్పొరేట్ కు దీటుగా ప్రభుత్వ వైద్యం
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి విడదల రజిని
గాజువాకలో పీహెచ్సీ ప్రారంభోత్సవం సందర్భంగా మీడియాతో ప్రత్యేక సమావేశం
*విశాఖపట్నం : టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో మన రాష్ట్రంలోని
ఆస్పత్రులన్నీ ఎన్నో అవస్థలతో ఉండేవని, జగనన్న అధికారంలోకొచ్చాక
ఆస్పత్రులకు ఎంతో వైభవం వచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి
విడదల రజిని అన్నారు. గాజువాక నియోజకవర్గం కణితి గ్రామంలో నూతన
పీహెచ్సీ భవనం ప్రారంభోత్సవానికి మంత్రి విడదల రజిని హాజరయ్యారు. ఈ
సందర్భంగా మంత్రి విలేకరులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి
విడదల రజిని మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో ఉండగా ఒక్క పీహెచ్సీనిగాని,
ఇతర ఏ ఆస్పత్రినిగాని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఆస్పత్రుల్లో
వసతులు మెరుగుపరచాలనే ఆలోచన కూడా చేయలేదన్నారు. వైద్య సిబ్బంది కొరత
పట్టిపీడిస్తున్నా నియమాకాల ఊసే లేకుండా పాలన సాగించారని ఆగ్రహం వ్యక్తం
చేశారు. గత ప్రభుత్వ హయాంలో సర్కారు ఆస్పత్రులన్నీ ప్రజల్లో
నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయాయన్నారు. చంద్రబాబు దౌర్భాగ్య పాలన వల్లనే
గతంలో ఈ దుస్థితి ఉండేదని నిప్పులు చెరిగారు. ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా
నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని
డిమాండ్చేశారు. కొత్తగా రాజకీయాల్లోకొచ్చిన వ్యక్తిలా బాబు ఇప్పుడు
పిల్లిమొగ్గలు వేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు ఏదో చేయాలనే తపన
ఉన్న వ్యక్తిలా నటిస్తున్నాడని మండిపడ్డారు. ఆయన మాయ మాటలను ప్రజలు
నమ్మరని స్పష్టం చేశారు. తమకు ఎవరు మంచి చేశారో ప్రజలకు అవగాహన
ఉందన్నారు.
అద్భుతంగా ప్రభుత్వ ఆస్పత్రులు
మంత్రి విడదల రజిని మాట్లాడుతూ జగనన్న అధికారంలోకొచ్చాక రాష్ట్రంలోని
అన్ని ఆస్పత్రులను గ్రామస్థాయి నుంచి టీచింగ్ ఆస్పత్రి వరకు అన్ని
స్థాయిల్లో అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియడారు. కణితిలో రూ.1.75 కోట్లతో
కొత్త పీహెచ్సీ భవనాన్ని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి
తీసుకొచ్చామన్నారు. ఈ ఆస్పత్రిలో ఇకపై ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు విధుల్లో
ఉంటారని, ఆశావర్కర్లు, ఎఎన్ ఎంలు, అటెండర్లు కాకుండానే మొత్తం 14 మంది
వైద్య సిబ్బంది ఇక్కడ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు ఎప్పుడూ
సిద్ధంగా ఉంటారన్నారు. ఈ పీహెచ్సీలో ఇకపై 215 మందులు, 65 రకాల వైద్య
పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ పీహెచ్సీల్లో గతంలో మనం ఎప్పుడూ చూడని
విధంగా ఓపీ, టెలీమెడిసిన్, ఈహెచ్ ఆర్, వైద్య పరీక్షలు, స్పెషాలిటీ వైద్య
సేవలు, ఉచితంగా మందులు లాంటి సేవలు ఇకపై అందుతాయని వివరించారు. ప్రజలకు
24 గంటలూ సేవలు అందిస్తుందన్నారు.
రాష్ట్రమంతా ఇలానే
ఒక్క కణితి గ్రామంలోనే కాదు… ఈ రాష్ట్రంలోని అన్ని పీహెచ్సీలను ఇలానే
అభివృద్ధి చేశామన్నారు. మొత్తం1125 పీహెచ్సీల ఆధునికీకరణ, నూతన భవనాల
నిర్మాణం కోసం జగనన్న రూ.670 కోట్లు ఖర్చు చేశారన్నారు. రాష్ట్రంలో
10,032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్లను నిర్మిస్తున్నామన్నారు. అందుకోసం
ఏకంగా రూ.1692 కోట్లను జగనన్న ఖర్చు చేస్తున్నారన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 121 సీహెచ్సీలు, 42 ఏరియా ఆస్పత్రుల ఆధునికీకరణ కోసం
మొత్తం రూ.1,223 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా
17 వైద్య కళాశాలల నిర్మాణం కోసం రూ.85, 000 కోట్లు ఖర్చు చేసేందుకు సైతం
జగనన్న వెనుకాడటం లేదన్నారు. టీచింగ్ ఆస్పత్రుల ఆధునికీకరణకు
జగనన్న రూ.3820 కోట్లు కేటాయించారన్నారు. ఇలా 16,855 కోట్ల రూపాయల
ఖర్చుతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి
ఆస్పత్రుల వరకు మొత్తం అన్నింటినీ అభివృద్ధి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు.