ముఖ్యమంత్రి మోకీలు, తుంటి లిగ్మెంట్లకు గాయాలు
కోల్‌కతా : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెను ప్రమాదం నుంచి
బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణం కారణంగా తీవ్ర
కుదుపులకు లోనైంది. దీంతో ఆమెతోపాటు ఉన్న అధికారులు, ఇతర సిబ్బంది తీవ్ర
ఆందోళనకు గురయ్యారు. ఆ సమయానికి హెలికాప్టర్ బైకుంఠ్పుర్ అటవీ ప్రాంతం పై
నుంచి భారీ వర్షంలో బాగ్డోగ్రా విమానాశ్రయం దిశగా ప్రయాణిస్తోంది.
పరిస్థితిని గుర్తించిన పైలట్ చాకచక్యంగా వ్యవహరించి హెలికాప్టర్‌ను శిలిగుడి
సమీపంలోని సెవోక్ ఎయిర్‌బేస్‌లో అత్యవసరంగా దించేశారు. ఈ సందర్భంగా
హెలికాప్టర్ నుంచి కిందకు దిగుతుండగా మమతా బెనర్జీ నడుము, కాళ్లకు
గాయాలయ్యాయి. అలాగే ఆమె అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బాగ్డోగ్రా
ఎయిర్‌పోర్టుకు చేరి విమానంలో కోల్‌కతా చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి
నేరుగా ఆమెను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి తరలించారు.
అక్కడ పలువురు నిపుణులైన డాక్టర్లు ముఖ్యమంత్రి గాయాలను పరిశీలించారు. ఎంఆర్ఐ
పరీక్ష నిర్వహించారు. అందులో ఎడమ మోకీలు, తుంటికి సంబంధించిన లిగ్మెంట్
గాయాలైనట్లు గుర్తించారు. వాటికి చికిత్స చేసి ఆసుపత్రిలో వైద్యం
చేయించుకోవాలని సీఎం మమతకు వైద్యులు సూచించారు. అయితే తాను ఇంటి వద్దనే
చికిత్స తీసుకుంటానని ఆమె రాత్రి 9 గంటల సమయంలో ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు.
మమత గాయపడ్డారని తెలుసుకుని రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ ఆమెకు ఫోన్
చేశారు. క్షేమసమాచారం అడిగి తెలుసుకున్నారు.