పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవర్నీ ఉపేక్షించం
టికెట్లపై నిర్ణయం అధిష్ఠానానిదే : మల్లికార్జున ఖర్గే
*ఢిల్లీలో రెండున్నర గంటలపాటు వ్యూహ సమావేశం
న్యూఢిల్లీ : ‘‘కాంగ్రెస్‌పై తెలంగాణ ప్రజలకు విశ్వాసం నానాటికీ పెరుగుతోంది.
రాష్ట్రంలో అధికార మార్పునకు పూర్తి అనుకూల వాతావరణం ఉంది. నాయకులు
పంచాయితీలకు దిగకుండా కలసికట్టుగా పనిచేయాలి’’ అని అగ్రనేత రాహుల్ గాంధీ
సూచించారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యూహ
సమావేశంనిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో
మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ప్రారంభమైంది. రెండున్నర గంటలకుపైగా భేటీ
సాగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం సమావేశంలో వ్యక్తిగత ఫిర్యాదులు చేయాలని
కొందరు నాయకులు భావించారు. అయితే ఆరంభంలోనే రాహుల్ మాట్లాడుతూ.. పరస్పర
విమర్శలు, విభేదాలు పక్కనపెట్టాలని హితవు పలికారు. ఎన్నికల్లో గెలుపే
లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఎంత పెద్ద
నేతలపైనైనా చర్యలు తీసుకుంటామని, అనవసరంగా మీడియా ముందు మాట్లాడితే
ఉపేక్షించబోమని హెచ్చరించారు. 120 రోజుల్లో ప్రతి రోజూ ఏం చేయాలనే దానిపై
దృష్టి సారించాలని సూచించడంతో పాటు అందుకు సంబంధించిన ప్రణాళికను వారి
ముందుంచారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను ప్రతి ఇంటికి, ప్రతి
వ్యక్తి వద్దకు తీసుకెళ్లాలన్నారు. భారాసతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి
పొత్తు ఉండబోదని స్పష్టంచేశారు.
బీజేపీ కి అనుకూలమైనందువల్లే భారాసను పట్నా సమావేశానికి ఆహ్వానించలేదని
తెలిపారు. ఖాళీగా ఉన్న పార్టీ పదవులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు.
టికెట్ల విషయం అధిష్ఠానం చూసుకుంటుందని, సాధ్యమైనంత త్వరగా తేల్చుతామని
మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు. కర్ణాటక ఎన్నికల సమయంలో అనుసరించిన
పద్ధతులను తెలంగాణలోనూ పాటించాలని సూచించారు. సమావేశంలో ఏఐసీసీ ప్రధాన
కార్యదర్శి(సంస్థాగత) కె.సి.వేణుగోపాల్, పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి
మాణిక్‌రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీలు
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సీతక్క,
శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, పొదెం వీరయ్య, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి,
జానారెడ్డి, దామోదర రాజనరసింహా, వీహెచ్, రేణుకా చౌదరి, మధుయాస్కీ,
బలరాంనాయక్, షబ్బీర్ అలీ, సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి తదితరులు
పాల్గొన్నారు.
బీజేపీకి మేలు చేసేందుకు కేసీఆర్ యత్నం : మాణిక్‌రావ్ ఠాక్రే
మహారాష్ట్రలో కాంగ్రెస్ బలంగా ఉన్నచోట భారాస చేరికలకు ప్రయత్నం చేస్తోందని,
తమ పార్టీకి నష్టం కలిగించి బీజేపీకి మేలు చేసేందుకే కేసీఆర్
ప్రయత్నిస్తున్నారని మాణిక్‌రావ్ ఠాక్రే ఆరోపించారు. వ్యూహ సమావేశం అనంతరం
ఏఐసీసీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మేనిఫెస్టో, ఎస్సీ, ఎస్టీ,
ఓబీసీ, మైనారిటీ అభ్యర్థులకు ప్రాధాన్యం, కేంద్ర ప్రభుత్వ అధికార
దుర్వినియోగం, పదేళ్ల భారాస ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం,
బూత్‌స్థాయి నుంచి పార్టీ నిర్మాణం, ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలను సంసిద్ధం
చేయడంపై సమావేశంలో చర్చించినట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. భారాసను గద్దె
దింపేందుకు నాయకులమంతా కలిసికట్టుగా ముందుకు సాగుతామన్నారు. ఈ వారంలోనే
ఎన్నికల కమిటీని, వచ్చే నెల కొన్ని సీట్లకు అభ్యర్థులను అధిష్ఠానం
ప్రకటిస్తుందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. తన నివాసంలో ఆయన
విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ దాదాపు 70 సీట్లపై స్పష్టత ఉందని, మిగతా
సీట్లపై త్వరగానే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రాజగోపాల్‌రెడ్డి
కాంగ్రెస్‌లో చేరుతారా అన్న ప్రశ్నకు ఆ విషయం తనకు తెలియదని బదులిచ్చారు.
తెలంగాణలోనూ కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో కలిసిరావాలని మధుయాస్కీ కోరారు.
జగ్గారెడ్డి.. ఆవేదన.. ఆనందం : సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యూహ
సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ తనపై నాలుగేళ్లుగా రకరకాలుగా ప్రచారం
చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై వ్యూహ సమావేశంలో ఫిర్యాదు
చేయడానికి ఉపక్రమించగానే రాహుల్ అడ్డుకొని సమావేశం తర్వాత తనతో మాట్లాడాలని
సూచించారు. సమావేశం ముగిసిన అనంతరం జగ్గారెడ్డి భుజంపై చెయ్యేసి ఏఐసీసీ
కార్యాలయం పక్కన ఉన్న సోనియా నివాసానికి తీసుకెళ్లారు. కొద్దిసేపటి తర్వాత
బయటికొచ్చిన జగ్గారెడ్డిని విలేకరులు ప్రశ్నించగా రాహుల్‌తో మాట్లాడాలనుకుంటే
ఆయన ఏకంగా చేయిపట్టుకొని తీసుకెళ్లడంతో పులకించిపోయానన్నారు. అంతర్గతంగా ఏం
జరిగిందో వెల్లడించనంటూ నవ్వుతూ వెళ్లిపోయారు.