సర్కోలీ బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్
హైదరాబాద్ : ఈ దేశంలో రాజకీయ పార్టీలు ఎన్నో రకాల నినాదాలిచ్చాయి. కానీ
‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ అని నినదించిన ఏకైక పార్టీ భారాస. 60
శాతానికి పైగా ఉన్న రైతులు, కార్మికులు భారాసకు మద్దతు ప్రకటిస్తుండటం ఇతర
పార్టీలకు భయాన్ని కలిగిస్తోంది. దీంతో అడ్డం పొడుగు మాటలు మాట్లాడుతున్నారు.
భారాస తెలంగాణ పార్టీ అంటున్నారు. భారతదేశ గతిని మార్చే జాతీయ పార్టీ ఇది.
దేశంలో పరివర్తన తీసుకొచ్చేందుకు ఏర్పాటైన మిషన్ ఇది. మార్పు దిశగా
పయనించకపోతే సంక్షేమం అభివృద్ధి సాధ్యం కాదు. ‘‘మహారాష్ట్రలో మేం
ప్రస్థానాన్ని ప్రారంభించి మూడు నాలుగు నెలలు మాత్రమే అవుతోంది. మిగతా
పార్టీలకు మా మీద ఎందుకింత ఆక్రోశం? ఇంత భయమెందుకు? తొందరపాటెందుకు? ఏ పార్టీ
మమ్మల్ని వదలటం లేదు. బీజేపీ , కాంగ్రెస్ రకరకాల ప్రకటనలు చేస్తున్నాయి.
బీజేపీ కి భారాస ‘బి టీమ్’ అని కాంగ్రెస్ అంటోంది. కాంగ్రెస్ పార్టీకి ‘ఎ
టీమ్’ అని భాజపా చెబుతోంది. వాళ్ల అభద్రతాభావానికి, ఓర్వలేని తనానికి ఈ
విమర్శ నిదర్శనం. మేము ఎవరి టీమ్ కాదు. భారాస రైతులు, వెనుకబడిన వర్గాలు,
అల్పసంఖ్యాకులు, దళితుల టీమ్. మేము ప్రజల పక్షం’’ అని భారాస అధినేత,
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మహారాష్ట్ర సోలాపుర్ జిల్లా
సర్కోలీలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ సభలోనే మాజీ
ఎమ్మెల్యే దివంగత భరత్ బాల్కే కుమారుడు, స్థానిక ఎన్సీపీ నేత భగీరథ్ బాల్కే
తన అనుచరులతో కలిసి భారాసలో చేరారు. వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి ప్రసంగించారు. తర్వాత తుల్జాపూర్లో
విలేకరులతోనూ మాట్లాడారు. ‘‘మన దేశానికి ఏదైనా లక్ష్యముందా? లేదా లక్ష్యం
లేకుండా మనం దారి తప్పిపోయామా? ప్రతి భారతీయుడూ ఈ విషయంపై ఆలోచించాలి.
నూతనోత్సాహంతో విప్లవ మార్గంలో ఒక కొత్త ఉషోదయం కోసం దేశం ముందుకు సాగాలి.
మహారాష్ట్రలో కాంగ్రెస్ యాభయ్యేళ్లు పాలించింది. తర్వాత ఎన్సీపీకి, శివసేనకు,
భాజపాకు అవకాశం కల్పించారు. వీరిలో ఒక్కరైనా మీ ఆకాంక్షలను నెరవేర్చారా?
మహారాష్ట్ర ధనిక రాష్ట్రం. అయినా తాగు, సాగునీటికి ప్రజలు ఇబ్బందులు
పడుతున్నారు. ఎందుకీ దుస్థితి? దేశంలో ఉన్న జలవనరులతో.. దేశంలోని ప్రతి ఎకరా
పంట భూమికి సాగునీటితో పాటు, ప్రజావసరాలకు తాగునీటిని అందించవచ్చు. దేశంలో
నూతన జల, విద్యుత్ విధానాలను తేవాల్సిన అవసరముంది. ఇదే పరివర్తన. మార్పు
తప్పకుండా జరిగి తీరాలి. తెలంగాణలో వ్యవస్థకు విపత్తుగా పరిణమించిన విలేజ్
రెవెన్యూ ఆఫీసర్ల వ్యవస్థను తొలగించి, వారి పొట్ట కొట్టకుండా వేర్వేరు
విభాగాల్లో వారికి ఉద్యోగాలిచ్చాం. భూ రికార్డులను డిజిటలైజ్ చేసి, రైతులకు
పథకాల అమలులో ఎలాంటి కష్టం లేకుండా చేస్తున్నాం. గ్రామ రెవెన్యూ ఉద్యోగులు
మాకు వ్యతిరేకంగా ఓటు వేస్తారు. అయినా జనం బాగు కోసం ఆ వ్యవస్థను ప్రక్షాళన
చేశాం. మహారాష్ట్రలోని ప్రతి ప్రాంతంలో నేను అడిగితే, గ్రామ రెవెన్యూ
వ్యవస్థను తొలగించాలని చెప్పారు.
రైతులంతా ఏకం కావాలి : ధనిక మహారాష్ట్రలో రోజూ ఆత్మహత్యలు చేసుకునే రైతుల
సంఖ్య పెరుగుతుండడం చాలా బాధను కలిగిస్తోంది. మహారాష్ట్రలో రైతులు ఎలాంటి
కష్టాలు పడుతున్నారో నాకు తెలుసు. పంట అమ్ముకున్నాక నాలుగైదు నెలలకు కూడా
వారికి డబ్బులు అందడం లేదు. ఉల్లి పంటకు మద్దతు ధర కోసం వేల మంది రైతులు
నాసిక్ నుంచి ముంబయి దాకా పాదయాత్ర చేయాల్సిన దుస్థితి. పాదాల నుంచి రక్తం
కారుతున్నా వారిని పట్టించుకున్న వారు లేరు. రైతు జీవించి ఉంటేనే మన భోజన
పాత్రల్లోకి భోజనం వస్తుంది. రైతు మరణిస్తే అందరి భోజన పాత్రలు ఎండిపోతాయి.
రైతు ప్రభుత్వం ఏర్పడితే ఈ సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుంది. రైతులంతా
ఏకమైతే తప్ప మన సమస్యలకు పరిష్కారం లభించదు.
ఎన్నికల్లో ప్రజలు గెలవాలి : కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం పోయి కాంగ్రెస్
ప్రభుత్వం ఏర్పడింది. ఏం మార్పు జరిగింది? ఎన్నికల్లో ప్రజలు గెలవడం
మొదలైనప్పుడే దేశంలో మార్పు సాధ్యమవుతుంది. అమెరికాలో నల్ల జాతీయుడైన బరాక్
ఒబామాను దేశాధ్యక్షునిగా ఎన్నుకొని ప్రజలు తప్పును సవరించుకున్నారు.
తుమ్మచెట్టును నాటితే మామిడి పండ్లు ఎలా కాస్తాయి? గాడిదలకు గడ్డి వేసి, ఆవుల
నుంచి పాలు ఎలా పొందగలం? మీకున్న ఓటు శక్తితో అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చు.
భారత్‌లో కూడా ఈ రకమైన మార్పు రావాలి. దళితుల ఉద్ధరణ జరగాలి. ఇది మన దేశ
కర్తవ్యం అన్నారు.