నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పలు కీలక
విషయాలను పేర్కొన్న నేతలు.. ప్రధాన ఎన్నికల అధికారికి లిఖితపూర్వకంగా ఆధారాలను
అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకుంటున్న ఓట్ల అవకతవకల వ్యవహారంపై
తెలుగుదేశం పార్టీ నేతలు నేడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ
రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి నేతృత్వంలో దేవినేని ఉమా, బొండా ఉమా, నక్కా
ఆనంద్ బాబు అశోక్ బాబు, వర్ల రామయ్య తదితరులు బృందంగా వెళ్లి.. రాష్ట్ర ప్రధాన
ఎన్నికల అధికారిని కలిశారు. అనంతరం ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు విషయాలను
ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీకి చెందిన నాయకులు కావాలనే టీడీపీ
సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని తెలియజేస్తూ.. లిఖితపూర్వకంగా ఆధారాలను
అందచేశారు.
ఏపీలో దొంగలు పడ్డారు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్‌లో దొంగలు పడ్డారని తెలుగుదేశం పార్టీ 2019లోనే చెప్పిందన్నారు.
గత నాలుగేళ్లుగా వనరులన్నీ వైఎస్సార్సీపీకి చెందిన దొంగల ముఠా దోచుకుంటుందని
ఆరోపించారు. ఎన్నికల ఏడాదిలో అధికార పార్టీకి చెందిన నాయకులు.. ఓట్లను దొంగతనం
చేస్తున్నారని మండిపడ్డారు. ఒకే ఇంట్లోని ఓటర్లను వేర్వేరు కేంద్రాలకు
మార్చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒకే ఇంటి నెంబర్‌పై వందల సంఖ్యలో ఓట్లను
నమోదు చేసి.. గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు
కావాలనే ఓట్ల జాబితాల నుంచి టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని
ఆగ్రహించారు. వీటిన్నంటినీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి దృష్టికి
తీసుకెళ్లి.. విచారణ చేయించాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు.
“నిబంధనలకు విరుద్ధంగా ఓట్లు తొలగించారు.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
చేస్తాం”
ఓట్ల అవకతవకలపై చర్యలు తీసుకుంటాం.. ఓట్ల అవకతవకలపై స్పందించిన సీఈవో.. ఓటరు
జాబితాలను తనిఖీ చేస్తామని హామీ ఇచ్చారని అచ్చెన్నాయుడు తెలియజేశారు. తనిఖీలో
సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడాలని టీడీపీ తరుపున తాము కోరామన్నారు.
అక్టోబర్ నాటికి ముసాయిదా జాబితా వస్తుందని.. ఆలోగా పొరపాట్లను సవరిస్తామని
సీఈవో చెప్పినట్లు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ అక్రమాల్లో కలెక్టర్లు
ఉన్నా, ఎమ్మార్వోలు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. ఓటరు
జాబితాల విషయంలో వాలంటీర్ల సాయంతో ప్రభుత్వం.. అక్రమాలకు పాల్పడుతోందని
అచ్చెన్నాయుడు ఆరోపించారు.
ఓట్ల జాబితాల్లో అవకతవకలు సృష్టించటం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, జగన్
మోహన్ రెడ్డికి బాగా అలవాటైపోయింది. 2019 తర్వాత జరిగిన ఏ ఎలక్షన్‌ల్లో వైసీపీ
దొంగ ఓట్లను సృష్టించి గెలిచిందే తప్ప.. ప్రజా బలంతో గెలవలేదు. మేము నెత్తి
నోరుకొట్టుకున్నాం.. ఏ ఒక్క ఎలక్షన్ కూడా సరిగ్గా జరగటంలేదని. ఇప్పుడు టీడీపీ
సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారు.. దొంగ ఓట్లను సృష్టిస్తున్నారు.. ఒకే
ఇంటి నెంబర్‌పై వందలకొలది ఓట్లను నమోదు చేస్తున్నారు. ఇందుకు ఓ ప్రధాన కారణం
ఉంది. అదేమిటంటే.. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వైసీపీ ప్రభుత్వంపై, జగన్‌పై
ఐదు కోట్ల మందిలో తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే వచ్చే ఎన్నికల్లో గెలబోమని ఈ
దుర్మార్గానికి పాల్పడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు
ఆరోపించారు.