ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి క్లాసులు
ఒక్కొక్క కళాశాలలో ఎంపీసీ 40, బైపీసీ 40 సీట్లు
17కు చేరిన ఏపీ బీసీ వెల్ఫేర్ జూనియర్ కళాశాలల సంఖ్య
అమరావతి : మహాత్మా జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకుల
విద్యాలయాల సంస్థ పరిధిలో మరో మూడు కొత్త జూనియర్ కాలేజీలు మంజూరు అయ్యాయి.
ఇప్పటికే రాష్ట్రంలో 14 జూనియర్ కాలేజీలు ఉండగా, కొత్తగా మంజూరైన వాటితో
కలిపి ఆ సంఖ్య 17కు చేరింది. కొత్త జూనియర్ కాలేజీలను ప్రస్తుత విద్యా
సంవత్సరం నుంచే ప్రారంభించారు. నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని
బేతంచర్ల(బాలురు), చిత్తూరు జిల్లా పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని
సదూం(బాలురు), శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస(బాలికలు) కాలేజీలు ప్రారంభమయ్యాయి.
ఒక్కో కాలేజీలో ఎంపీసీ 40, బైపీసీ 40 సీట్లు చొప్పున కేటాయించారు. కాగా,
రాష్ట్రంలో బీసీ గురుకుల విద్యాలయాల సంస్థ పరిధిలో మొత్తం 105 గురుకులాలు
ఉన్నాయి. వాటిలో 17 జూని యర్ కాలేజీలు కాగా, మిగిలిన 88 పాఠశాలల్లో 5 నుంచి
10వ తరగతి వరకు క్లాసులు నిర్వహిస్తున్నారు. మొత్తం 44 వేల మంది విద్యార్థులు
వీటిలో చదువుతున్నారు.
నీట్, జేఈఈలో బీసీ విద్యార్థుల ప్రతిభ : నీట్, జేఈఈ పరీక్షల్లో బీసీ
విద్యార్థులు ప్రతిభ చూపారని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాలయాల సంస్థ
కార్యదర్శి కృష్ణమోహన్ తెలిపారు. వాటి ఫలితాలను అంచనా వేస్తే మెడికల్ సీట్లు
నలుగురు, డెంటల్ ఒకరు, వెటర్నరీ నలుగురు, అగ్రికల్చర్ బీఎస్సీ సీట్లు
నలుగురు సాధించే అవకాశం ఉందని చెప్పారు. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ ఆరుగురు
విద్యార్థులు, ఇంజినీరింగ్ సీట్లు 24 మంది సాధించనున్నారని వివరించారు.