వారం ముందే చేరిన రష్యా అణ్వస్త్రాలు
11న 31 దేశాల కీలక సమావేశం
రష్యాలో తిరుగుబాటును చూసి ఆనందించిన నాటో కూటమిలో కొత్త ఆందోళన మొదలైంది.
పుతిన్‌పై తిరుగుబాటు చేసి, కొద్దిగంటల్లోనే వెనక్కి తగ్గిన కిరాయి సైనిక
బృందం వాగ్నర్, దాని అధిపతి ప్రిగోజిన్ బెలారస్‌లోకి అడుగుపెట్టడమే ఆ
ఆందోళనకు కారణం. ప్రిగోజిన్‌తో పాటు వాగ్నర్ దళాలు సైతం బెలారస్లో ఆశ్రయం
పొందటానికి పుతిన్ ఉదారంగా అనుమతించటంపై అనుమానాలు మొదలయ్యాయి. దీంతో
వచ్చేనెల 11న అమెరికా సారథ్యంలోని నాటో దేశాలన్నీ భద్రతపై సమీక్ష కోసం సమావేశం
కాబోతున్నాయి. దానికి 31 నాటో దేశాలు హాజరవుతాయి. ‘‘ఏం జరుగుతోందో
ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేకున్నా మా జాగ్రత్తలో మేం ఉన్నాం. మాస్కోతో పాటు
మిన్స్క్ (బెలారస్ రాజధాని)కు కూడా ఒకే విషయం స్పష్టం చేస్తున్నాం. నాటో
భూభాగంలో ప్రతి అంగుళాన్నీ కాపాడుకుంటాం. అన్ని దేశాల భద్రతపై ముఖ్యంగా
బెలారస్ సరిహద్దుల్లోని దేశాల రక్షణపై నిర్ణయం తీసుకుంటాం’’ అని నాటో చీఫ్
జెన్స్ స్టోల్తెన్‌బర్గ్ స్పష్టం చేశారు.
ఎందుకీ గుబులు? : గతవారం రష్యా ప్రభుత్వంపై వాగ్నర్ గ్రూపు తిరుగుబాటు
వార్తలు నాటో కూటమిలో సంతోషాన్ని నింపాయి. కొద్దిగంటల్లోనే తిరుగుబాటు
చల్లారినా పుతిన్‌పై ఇవన్నీ ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయనుకున్నారు. కానీ
తిరుగుబాటును చల్లార్చే క్రమంలో ప్రిగోజిన్‌తో పాటు వాగ్నర్ దళాలు బెలారస్లో
ఆశ్రయం తీసుకోవటానికి పుతిన్, బెలారస్ అంగీకరించటం.. నాటోకు ఇబ్బందికరంగా
పరిణమించింది. పుతిన్‌కు పూర్తి అనుకూలదేశమైన బెలారస్‌ను ఆనుకొని పలు నాటో
దేశాలున్నాయి. ముఖ్యంగా బెలారస్‌తో సరిహద్దు పంచుకుంటున్న పోలండ్, లాత్వియా,
లిథువేనియాల్లో గుబులు మొదలైంది. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు కూడా
బెలారస్‌తో సరిహద్దుంది. ప్రిగోజిన్‌తో పాటు బెలారస్లో అడుగుపెట్టిన వాగ్నర్
దళాలు తమకు ముప్పుగా పరిణమిస్తాయనేది సరిహద్దు దేశాల భయం. ‘‘ప్రిగోజిన్,
వాగ్నర్ దళాలు బెలారస్‌లోకి రావటం మాకు ప్రతికూల సంకేతంగా కనిపిస్తోంది. మా
దేశాల భద్రతపై నాటో తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది’’ అని పోలండ్
అధ్యక్షుడు ఆండ్రీ డూడో, లిథువేనియా అధ్యక్షుడు గిటనస్ నౌసెదా ఆందోళన
వ్యక్తంజేశారు.
అది పుతిన్ ఎత్తుగడేనా? : తిరుగుబాటు పేరుతో పుతిన్, ప్రిగోజిన్ కలసి నాటకం
ఆడి… వాగ్నర్ దళాలను పెద్దఎత్తున బెలారస్‌లోకి ప్రవేశపెట్టారనే అనుమానాలు
కూడా తలెత్తుతున్నాయి. తమ సైన్యంలో అవిశ్వాస పాత్రులను ఏరేయటానికి,
బెలారస్‌లోకి వాగ్నర్ దళాలను పంపించటానికి పుతిన్ ఈ ఎత్తుగడ వేశారనేది
కొంతమంది విశ్లేషణ. బెలారస్‌లోకి వాగ్నర్ దళాలు, ప్రిగోజిన్ రాకతో
ఉక్రెయిన్‌కు ముప్పు మరింత పెరిగిందని యునైటెడ్ కింగ్డమ్ మాజీ
సైన్యాధ్యక్షుడు లార్డ్ డనాట్ హెచ్చరించటం గమనార్హం. ‘‘తిరుగుబాటు పేరుతో ఏం
జరిగిందో ఇప్పుడే చెప్పలేంగానీ, బెలారస్‌లోకి వాగ్నర్ రాక మంచి సంకేతం కాదు.
రష్యా గడ్డపై నుంచి కంటే బెలారస్ నుంచి ఉక్రెయిన్‌పై దాడి సులువు. ఉక్రెయిన్
మరింత అప్రమత్తంగా ఉండాలని డనాట్ విశ్లేషించారు. ఈ పరిణామాలకు వారంరోజుల
ముందే రష్యా తన అణ్వస్త్రాలు కొన్నింటిని బెలారస్‌కు తరలించటం గమనార్హం.