రష్యాలో తిరుగుబాటు చేసిన కిరాయి సైన్యం వాగ్నర్ దళాల అధిపతి ప్రిగోజిన్
అసలు లక్ష్యం ఏంటి? ఎందుకు తిరుగుబాటు చేశారు?… అంటే రష్యా రక్షణ శాఖలో
ఇద్దరు కీలక వ్యక్తులను పట్టుకునేందుకే ఇదంతా జరిగిందని అమెరికా మీడియా అంచనా
వేస్తోంది. రష్యా రక్షణ మంత్రి సెర్గీ షొయిగు, ఆర్మీ జనరల్ గెరసిమోవ్లను
బంధించాలనే లక్ష్యంతోనే ప్రిగోజిన్ రొస్తోవ్ ఆన్ డాన్‌లోని సైనిక
స్థావరాన్ని ఆధీనంలోకి తీసుకొన్నాడని అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్
వెల్లడించింది. వారిద్దరూ ఉక్రెయిన్ సరిహద్దుల సందర్శనకు వచ్చిన సమయంలో తన
కుట్రను అమలు చేయాలని ప్రిగోజిన్ భావించాడని తెలిపింది. మరోవైపు రష్యా
సైన్యంలోని ఓ కీలక కమాండర్‌కు ప్రిగోజిన్ తిరుగుబాటు చేస్తాడనే విషయం ముందే
తెలుసని అమెరికా పత్రికలు పేర్కొన్నాయి. ఈ తిరుగుబాటు మొదలయ్యాక వెనక్కి
తగ్గాలంటూ ప్రిగోజిన్‌కు ఆ కమాండరే సూచించాడని వివరించాయి. ఐరోపాలోని కొన్ని
నిఘా వర్గాలు మాత్రం ప్రిగోజిన్ ఎత్తుగడల గురించి రష్యా భద్రతా దళాల్లోని
కొందరికి తెలిసినా వాటిని ఉన్నత స్థాయిలోని వారికి చేరవేయలేదని చెబుతున్నాయి.
ఎందుకంటే ప్రిగోజిన్ వ్యూహాలు విజయవంతం కావాలని వారు ఆశించినట్లు ఆ వర్గాలు
పేర్కొన్నాయి. మరోవైపు రష్యా నేషనల్ గార్డ్ డైరెక్టర్ విక్టర్ జొలోటోవ్
ఇటీవల మాట్లాడుతూ తమ సీనియర్ అధికారులకు ప్రిగోజిన్ ప్రణాళికల గురించి
తెలుసని అంగీకరించారు. ఈ తిరుగుబాటు వెనుక పశ్చిమదేశాల ఇంటెలిజెన్స్ సంస్థల
హస్తం ఉందని ఆరోపించారు. అందుకే వారికి సైనిక తిరుగుబాటు గురించి వారాల
ముందుగానే తెలుసన్నారు.