న్యూఢిల్లీ : కేంద్ర మంత్రిమండలి సమావేశం జులై 3న జరగనుంది. ప్రగతి మైదాన్‌లో
నూతనంగా నిర్మించిన ‘ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్’లో ఆ రోజు
సాయంత్రం ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. జులై 17 నుంచి పార్లమెంటు వర్షాకాల
సమావేశాలు ప్రారంభం కాబోతుండడంతో ఆలోగా కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు
తెచ్చేలా విస్తరణ జరిగే అవకాశాలున్నట్లు విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీనిని
బలపరిచే రీతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , హోంమంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ
అధ్యక్షుడు జె.పి.నడ్డా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి
బి.ఎల్.సంతోష్‌లు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. దీంతో అటు పార్టీలో, ఇటు
మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంచనా
వేస్తున్నాయి. షా, నడ్డా, సంతోష్‌లు గత కొద్దిరోజులుగా విడతలవారీగా చర్చలు
సాగిస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో మొత్తం మంత్రిమండలి సమావేశం కాబోతోంది. ఈ
ఏడాది చివరలో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం
అసెంబ్లీలకు ఎన్నికలున్నాయి. తర్వాత 5 నెలల్లోనే సార్వత్రిక ఎన్నికల నగారా
మోగనుంది. అన్నింటికీ సరిపోయేలా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చన్న భావన
వ్యక్తమవుతోంది. సాధారణంగా పార్లమెంట్ సమావేశాలకు ముందు కూడా మంత్రిమండలి
సమావేశమవుతుంది. తాజాభేటీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకా? ఎప్పటిమాదిరిగా
పార్లమెంటు సమావేశాల కోసమా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
కేబినెట్కీ..ఈ సమావేశానికి తేడా ఇదీ : సాధారణ మంత్రివర్గ సమావేశాల్లో
కేబినెట్ మంత్రులు పాల్గొంటారు. అవసరమైనప్పుడు స్వతంత్ర హోదాలో ఉన్న సహాయ
మంత్రులూ పాలుపంచుకుంటుంటారు. సహాయ మంత్రులకు అందులో పాల్గొనే అవకాశం ఉండదు.
కానీ మంత్రిమండలి సమావేశంలో మొత్తం మంత్రివర్గం పాల్గొననుంది. ఇందులో
విధానపరమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం లేకపోయినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం
చేపట్టిన కార్యక్రమాల అమలు విషయంలో మంత్రులకు ప్రధాని దిశానిర్దేశం చేసే
అవకాశం ఉంటుంది.