పట్టాలిచ్చిన రెండు రోజుల్లోనే రైతుబంధు నిధులు
నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని, జిల్లా ఎస్పీ
కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం
హైదరాబాద్ : రాష్ట్రంలో అటవీ భూములపై హక్కుల కోసం ఎదురుచూస్తున్న గిరిజనులకు
పోడు భూముల పట్టాల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 1,51,146
మంది గిరిజనులకు 4,06,369 ఎకరాలపై హక్కు పట్టాలు అందజేయనుంది. కుమురం భీం
ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ శుక్రవారం పోడు పట్టాల పంపిణీ
కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆ జిల్లాలో నూతనంగా నిర్మించిన జిల్లా
కలెక్టరేట్ కార్యాలయాన్ని, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించి,
గిరిజనులకు పోడుపట్టాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం జిల్లాల్లో మంత్రులు,
ఎమ్మెల్యేలు అర్హులైన రైతులకు పట్టాలు అందజేస్తారు. మహబూబాబాద్‌లో పోడుపట్టాల
పంపిణీ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్, భద్రాద్రి
కొత్తగూడెంలో మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్‌లు పాల్గొననున్నారు.
అటవీ హక్కుల చట్టం-2005 చట్టం కింద రాష్ట్రంలో ఒకేసారి 1.51 లక్షల మంది
గిరిజనులకు 4.06 లక్షల ఎకరాలపై హక్కులు పంపిణీ చేయనుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ
చట్టం కింద 96 వేల మందికి 3.08 లక్షల ఎకరాల పంపిణీ జరిగింది. దేశంలో
ఛత్తీస్‌గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల తరువాత అత్యధిక అటవీభూములపై పోడుహక్కులు
కల్పించిన రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది.
పట్టాలిచ్చిన రెండు రోజుల్లోనే రైతుబంధు నిధులు : జిల్లాల వారీగా పోడుహక్కు
పత్రాలకు అర్హులైన గిరిజనుల జాబితాను జిల్లా కలెక్టర్లు సిద్ధం చేశారు.
పోడుపట్టా పాస్‌పుస్తకాల వివరాలతో కూడిన జాబితాలను జిల్లా వ్యవసాయాధికారులకు
అందించారు. వ్యవసాయ అధికారులు సంబంధిత పోడుపట్టాల అర్హులకు ఫోన్‌చేసి, బ్యాంకు
పాస్‌బుక్ తీసుకుని రైతుబంధు కోసం అనుసంధానిస్తున్నారు. ఈ ప్రక్రియ వారం
రోజులుగా కొనసాగుతోంది. గిరిజనులకు పోడు పట్టాలు అందిన రెండు రోజుల్లో అందరికీ
రైతుబంధు నిధులు జమయ్యేలా గిరిజన సంక్షేమశాఖ జిల్లా అధికారులతో కలిసి చర్యలు
చేపట్టింది. రైతులకు పంపిణీ చేసే పట్టాలకు సంబంధించి హక్కుపత్రాల పాస్బుక్ల
ముద్రణ పూర్తిచేసింది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,51,195
ఎకరాలకు, మహబూబాబాద్‌లో 67,730 ఎకరాలకు, ఆసిఫాబాద్ జిల్లాలో 47,138 ఎకరాలకు
పోడు పట్టాలు అందనున్నాయి.