హనుమకొండలో బహిరంగ సభలో పాల్గొననున్న మోడీ
జులై 8న హైదరాబాద్‌లో జరగాల్సిన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత
ప్రధాన కార్యదర్శుల సమావేశం వాయిదా
హైదరాబాద్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జులై 8న రాష్ట్రానికి రానున్నారు.
కాజీపేటలో ఏర్పాటు చేయనున్న వ్యాగన్ తయారీ, పీరియాడికల్
ఓవర్‌హాలింగ్(పీఓహెచ్) వర్క్‌షాప్‌నకు, మెగా టెక్స్టైల్ పార్కుకు
శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో బహిరంగ
సభలో పాల్గొంటారని భాజపా వర్గాలు తెలిపాయి. తొలుత జులై 12న ప్రధాని పర్యటన
ఉండేలా నిర్ణయించినా నాలుగు రోజులు ముందుకు మారింది. ప్రధాని పర్యటన నేపథ్యంలో
జులై 8న హైదరాబాద్‌లో జరగాల్సిన 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత
ప్రధాన కార్యదర్శుల సమావేశం వాయిదా పడింది. బహిరంగ సభ ఏర్పాట్లపై వరంగల్
జిల్లా నేతలతో పాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల
ప్రేమేందర్‌రెడ్డితో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి
కిషన్‌రెడ్డి చర్చించారు. సభకు పెద్దఎత్తున జన సమీకరణ చేయాలని నిర్ణయించారు.
వరంగల్‌కు ప్రధాని నరేంద్ర మోడీ మొదటిసారి వస్తున్న నేపథ్యంలో పూర్వపు వరంగల్
జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాను లక్ష్యంగా చేసుకుని సభ నిర్వహించనున్నారు.
శాసనసభ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనున్న నేపథ్యంలో పార్టీ బలోపేతమే
లక్ష్యంగా బీజేపీ వేగం పెంచింది. జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఇటీవలే
నాగర్‌కర్నూల్ బహిరంగ సభలో పాల్గొన్నారు. అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
ఖమ్మం పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో ప్రధాని పర్యటన ఖరారు కావడంతో నేతలు
ఉత్సాహంగా ఉన్నారు. శ్రేణుల్లో ఉత్తేజం నింపడంతో పాటు ఎన్నికలకు నేతలను
సమాయత్తం చేసేందుకు ఈ పర్యటన దోహదం చేస్తుందని బీజేపీ వర్గాలు
భావిస్తున్నాయి. ఇప్పటికే మహా జన్‌సంపర్క్ అభియాన్‌లో భాగంగా ఈ నెల ఒకటో తేదీ
నుంచి భాజపా వివిధ కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటోంది. బూత్‌ల వారీగా పార్టీని
బలోపేతం చేయడానికి మేరా బూత్ సబ్సే మజ్బూత్ (నా పోలింగ్ బూత్
అన్నింటికన్నా శక్తిమంతమైంది) కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో వివిధ
రాష్ట్రాల నుంచి వచ్చిన 650 మంది విస్తారక్‌లు పాల్గొంటున్నారు. జులై 5వ తేదీ
వరకు ఇది కొనసాగనుంది. రానున్న శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా ప్రతినెలా అగ్రనేతల
పర్యటనలతో పాటు రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలను బలోపేతం చేయడం, కేంద్ర
ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా బీజేపీ
కార్యాచరణ అమలు చేస్తోంది. తొమ్మిదేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం
రాష్ట్రంలో అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలు, నిధుల వ్యయంపై ఇటీవల కేంద్ర
మంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి వివరించారు. జాతీయ
నాయకులు రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు జులై నుంచి వారి పర్యటనలు
క్రమంతప్పకుండా ఉంటాయని పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీ ఎన్నికల వరకు
అనుసరించాల్సిన వ్యూహంపై ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో ఢిల్లీ
నేతలు చర్చించారు. పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయడం, ప్రజల్లోనే ఉండటం
వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.