నెల్లూరు : నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు పొంగూరు నారాయణను నెల్లూరు
సిటీ తెలుగుదేశం ఇన్ చార్జిగా పార్టీ నియమించింది. ఈ మేరకు తెలుగుదేశం
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.
నారాయణ విద్యా సంస్థల ద్వారా తెలుగు రాష్ట్రాలలో విద్యావ్యాప్తికి దోహదపడిన
ఆయన నవ్యాంధ్ర రాజధాని అమరావతి రూపకల్పన, నిర్మాణంలో అప్పటి మునిసిపల్ శాఖ
మంత్రిగా కీలక పాత్ర పోషించారు. గత తెలుగుదేశం హయాంలో మునిసిపల్ శాఖ
మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పొంగూరు నారాయణ, నారాయణ విద్యాసంస్థల అధిపతి
అన్న సంగతి విదితమే. 2014 ఎన్నికలలో తెలుగుదేశం విజయం కోసం విశేషంగా కృషి
చేసిన నారాయణ ఆ ఎన్నికలలో తెలుగుదేశం విజయం తరువాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
కాకపోయినా చంద్రబాబు కేబినెట్ లో అత్యంత కీలకమైన మునిసిపల్ శాఖను
నిర్వహించారు. అంతే కాకుండా చంద్రబాబుఅత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జన
రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక బాధ్యతలను అప్పగించారు. సీఆర్డీయే బాధ్యతలూ
ఆయనే నిర్వహించారు. అమరావతి అద్భుత రాజధానిగా రూపొందేందుకు అవసరమైన పునాదులు
వేయడంలో చంద్రబాబుకు కుడి భుజంగా వ్యవహరించారు. అదలా ఉంచితే 2019 ఎన్నికలలో
వైసీసీ విజయం సాధించి, జగన్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత సీన్
మారిపోయింది.
అమరావతిని నిర్వీర్యం చేయడమే కాకుండా ఆ అమరావతి నిర్మాణంలో కీలకంగా
వ్యవహరించిన నారాయణపై జగన్ సర్కార్ కక్ష పూరితంగా వ్యవహరించింది. వరుస కేసులతో
ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో, పార్టీలో
కీలకంగా వ్యవహరించిన నారాయణ పార్టీకీ, రాజకీయాలకూ కూడా ఒకింత దూరమయ్యారు.
కేసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడంతో ఆయన రాజకీయ యవనికపై పెద్దగా
కనిపించలేదు. అయినా వైసీపీ ప్రభుత్వం ఆయనపై కక్ష సాధింపు ధోరణితోనే
వ్యవహరించింది. ఆయన విద్యాసంస్థలపై దృష్టి సారించింది. టెన్త్ పేపర్ లీకేజీ
సాకుతో ఆయనపై మరిన్ని కేసులు నమోదు చేసింది. అయితే ఆ కష్ట సమయంలో ఆయనకు
తెలుగుదేశం అండగా నిలిచింది. కానీ అధికారంలో ఉన్నప్పుడు అందలం ఎక్కించిన
పార్టీకి అధికారం కోల్పోగానే దూరమయ్యారన్న విమర్శలను నారాయణ ఎదుర్కొన్నారు. ఆ
విమర్శలన్నిటినీ పంటిబిగువున భరించిన నారాయణ కేసుల దాడి నుంచి ఒకింత ఊరట
లభించగానే మళ్లీ క్రియాశీలంగా మారారు. 2014 నుంచి 2019 వరకు
నవ్యాంధ్రప్రగతిలో తన వంతు బాధ్యత నిర్వహించిన నారాయణ నెల్లూరు అభివృద్ధికి
ప్రత్యేక ప్రాధాన్యత నిచ్చారు. జిల్లా ప్రజల అభిమానానికి పాత్రులయ్యారు.
అటువంటి నారాయణను జగన్ సర్కార్ టార్గెట్ చేసింది. అమరావతి, సీఆర్డీఏలో
అక్రమాలంటూ కేసులు పెట్టింది. నారాయణ విద్యాసంస్థలపై ప్రభుత్వ దాడులు
జరిగాయి. వాటన్నిటినీ తట్టుకుని నిలబడి మళ్లీ నెల్లూరు రాజకీయాలలో క్రియాశీలం
అవుతున్నారు. స్థానికంగా మంచి పేరు ఉన్న నారాయణను నెల్లూరు సిటీ తెలుగుదేశం
ఇన్ చార్జిగా నారాయణను ప్రకటించడం ద్వారా స్థానికంగా బలమైన బీసీ నేతగా ఉన్న
మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ కు తెలుగుదేశం చెక్ పెట్టిందనే
చెప్పాలి.