ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్
విజయవాడ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 5 కోట్ల ప్రజలకి నిజమైన
ప్రత్యామ్నాయమని, కర్నాటక గెలుపు తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అనూహ్యంగా
పుంజుకుంటుందని ఏపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక అద్యక్షుడు జంగా గౌతమ్
చెప్పారు. రాష్ట్రంలో అధికార వైసీపీ ప్రతిపక్ష టిడిపి, జనసేన అన్ని పార్టీలు
బిజెపి కి అనుబందం గా మారాయని, ఈ మూడు పార్టీల అగ్ర నాయకులూ బిజెపి
రాష్ట్రానికి చేసిన అన్యాయం పైన ఒక్క మాట కూడా విమర్శలు చేయలేక పోతున్నారని
గౌతమ్ విమర్శించారు.
శుక్రవారం విజయవాడ లోని ఆంధ్ర రత్న భవన్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో జంగా
గౌతమ్ మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీకి టిడిపి కానీ జనసేన కానీ ప్రత్యామ్నాయం
కాదని.. బిజేపి అంటే రాష్ట్రంలో బాబు, జగన్, పవన్ అని తేలిపోయిందనీ కనుక
రాష్ట్ర ప్రజలకి నిజమైన ప్రజా ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ యే నని జంగా
గౌతమ్ వివరించారు.
ఇదే విషయాన్ని విజయవాడ వేదికగా పలువురు మేధావులు, ప్రజాస్వామిక వాదులు
రాష్ట్రానికీ పిలుపు నివ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతం పలుకుతోందనీ గౌతమ్
చెప్పారు. బిజేపి కుట్రలకు లొంగిపోతూ రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతూ అధికార
వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ,పార్టీలు పనిచేస్తున్నాయని రాష్ట్రంలో 500 మంది
మేధావులు సంతకాలుచేసి ప్రజలకి తెలపడం గొప్ప పరిణామం అని గౌతమ్ వివరించారు.
కర్నాటక లో బిజేపిని ఓడించడానికి అక్కడి పౌర సమాజ మేధావులు ఎంతో క్రియాశీలంగా
వ్యవహరించారని, ఆంధ్రప్రదేశ్ లో కూడా విద్యావంతులు, ప్రజా స్వామిక మేధావులు
ముందుకు వచ్చి బిజేపి కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునివ్వడం హర్షణీయమన్నారు.
విజయా డెయిరీ విషయంలో మాట తప్పిన జగన్
చిత్తూరు జిల్లాలో 25 లక్షల పాడి రైతుల భాగస్వామ్యం ఉన్న విజయ డైరీని తాము
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పునరుద్ధరిస్తామని పాదయాత్రలో హమీ ఇచ్చిన
జగన్ నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు విజయ డైరీని గుజరాత్ కు చెందిన అమూల్ కి
తాకట్టు పెట్టడం అంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే నని కాంగ్రెస్ పార్టీ
భావిస్తున్నదన్నారు.. విజయ డైరీని విజయా డెయిరీ గా పునరుద్ధరించేందుకు
ప్రభుత్వం సహాయం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నదన్నారు. అమూల్ తో
ఒప్పందాన్ని చిత్తూరు పాడి రైతులు మనస్పూర్తిగా అంగీకరించడం లేదన్నారు. జగన్
గతంలో హామీ ఇచ్చింది ఒకటి ఇప్పుడు చేస్తున్నది మరోటి అనీ గౌతమ్ చెప్పారు.
విజయా డెయిరీ వ్యవస్థాపకులు వీర రాఘవుల విగ్రహాన్ని డెయిరీ ముఖ ద్వారం వద్ద
నుంచి తొలగించడం అన్యాయమన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో సిటీ కాంగ్రెస్
అధ్యక్షులు నరహరి శెట్టి నరసింహ రావు, డా. శాస్త్రి జంద్యాల, బైపూడి
నాగేశ్వరరావు, అన్సారీ, సాంబశివరావు, కొమ్మినేని సురేష్, తదితరులు
పాల్గొన్నారు.