100 పడకల ఆస్పత్రి, బీసీ,ఎస్సీ నివాస పాఠశాల నిర్మాణ పనుల పరిశీలన
మంత్రి బుగ్గన సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 30 యు.కొత్తపల్లి
కుటుంబాలు
డోన్ : డోన్ నియోజకవర్గంలో ప్రగతి పరుగులు పెడుతోందని ఆర్థిక శాఖ మంత్రి
బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. శుక్రవారం డోన్ లోని యు.కొత్తపల్లిలో
నిర్మించిన గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలను మంత్రి బుగ్గన
ప్రారంభించారు. రూ. 17.5 లక్షలతో ఆరోగ్య కేంద్రం, రూ.40 లక్షల వ్యయంతో గ్రామ
సచివాలయాలను అత్యాధునిక సదుపాయలతో తీర్చిదిద్దినట్లు ఆయన పేర్కొన్నారు.
కొత్తపల్లి సెంటర్ నుంచి ప్రారంభోత్సవ వేదిక వరకూ మంత్రి బుగ్గనకు గ్రామస్తులు
ఘనస్వాగతం పలికారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమక్షంలో డోన్
ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ ద్వయం వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాన్ని
ప్రారంభించారు. అనంతరం ప్రారంభోత్సవానికి గుర్తుగా మంత్రి బుగ్గన వైద్య
కేంద్రం ప్రాంగణంలో ఒక మొక్కను నాటారు. గ్రామ సచివాలయాన్ని మంత్రి బుగ్గన
నేతృత్వంలో యు.కొత్తపల్లి గ్రామ సర్పంచ్ శ్రీవిద్య ప్రారంభించారు. వైద్య
కేంద్రం, సచివాలయం మధ్యలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో ఆర్థిక మంత్రి బుగ్గన
ప్రజల నుంచి పలు రకాల సమస్యలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించారు. వాటిలో
అప్పటికప్పుడే పరిష్కారమయ్యే అంశాలపై అధికారులను త్వరగా పూర్తి చేయాలని
ఆదేశించారు. అనంతరం రైతులకు రాయితీపై అందించే విత్తనాలు, వ్యవసాయ పనిముట్లను
పంపిణీ చేశారు. చివరగా యు.కొత్తపల్లికి చెందిన 30 కుటుంబాలు మంత్రి బుగ్గన
ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. పార్టీ కండువా కప్పి మంత్రి
బుగ్గన ఆహ్వానించారు.
అనుకున్నది అనుకున్నట్లు జరిగితే డోన్ 100 పడకల ఆస్పత్రి ఒక మోడల్ ఆస్పత్రిగా
మారుతుందని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. ప్రభుత్వ భవనాల ప్రారంభోత్సవాల
అనంతరం డోన్ లో వేగంగా జరుగుతున్న 100 పడకల ఆస్పత్రి పనులను ఆర్థిక మంత్రి
బుగ్గన రాజేంద్రనాథ్ ప్రారంభించారు. సమయం నిర్దేశించుకుని త్వరలోనే పనులను
పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.ఆస్పత్రిలోని ప్రతి విభాగాన్ని
పరిశీలిస్తూ..పలు సూచనలిస్తూ ముందుకు సాగారు. చివరిగా ఆస్పత్రి పక్కనే
నిర్మిస్తోన్న బీసీ నివాస పాఠశాలకు సంబంధించిన పనులను కూడా మంత్రి
పరిశీలించారు. నిర్మిస్తున్న ప్రాంగణమంతా కలియతిరుగుతూ ఇంజినీర్లు,
కాంట్రాక్టర్లు, అధికారులకు చేయవలసిన మార్పులకు సంబంధించి ఆదేశాలిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు, డోన్ ఎంపీపీ
రేగటి రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ రాజ్ కుమార్, యు.కొత్తపల్లి గ్రామ సర్పంచ్
శ్రీవిద్య, కో ఆప్షన్ మెంబర్ హుస్సేన్, ఆర్డీవో వెంకట్ రెడ్డి, డోన్ మాజీ
మార్కెట్ యార్డ్ ఛైర్మన్ రామచంద్రుడు, గ్రామ ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీ నాయకులు పాల్గొన్నారు.