విజయవాడ సెంట్రల్ : అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరాలనే
ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న సురక్ష’ అనే బృహత్తర కార్యక్రమానికి
శ్రీకారం చుట్టిందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే
మల్లాది విష్ణు అన్నారు. జూలై 1 నుంచి కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో
శుక్రవారం ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం
నిర్వహించారు. ఈ సందర్భంగా పథకం లక్ష్యాలను వివరించారు. అర్హత కలిగిన
వారందరికీ ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు, సేవలు అందించడంతో పాటు అవసరమైన కీలక
ధృవపత్రాలు ఎటువంటి రుసుం లేకుండా అందించడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 2.60 లక్షల మంది వాలంటీర్లు., 1.5 లక్షల మంది సచివాలయ
సిబ్బంది., 3 వేల మంది మండల స్థాయి అధికారులు నాలుగు వారాల పాటు 15 వేల
క్యాంపుల ద్వారా ప్రజలకు సేవలు అందించనున్నట్లు వెల్లడించారు. సెంట్రల్
నియోజకవర్గంలోని 96 సచివాలయాల పరిధిలో 23 క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్లు
తెలియజేశారు. వీటి ద్వారా ఏ ఒక్క అర్జీ కూడా పునరావృతం కాకుండా శాశ్వత
పరిష్కారం చూపడం జరుగుతుందన్నారు. అలాగే కుల, ఆదాయ, జనన, మరణ, వివాహ, ఫ్యామిలీ
మెంబర్ సర్టిఫికెట్ సహా 11 రకాల ధ్రువీకరణ పత్రాలను ఎటువంటి రుసుము లేకుండా,
మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే ఆగష్టు 1 న కొత్త
రేషన్ కార్డులు, పింఛన్లు అందిస్తామని తెలియజేశారు. ప్రజలందరూ ఈ సేవలను
వినియోగించుకునేలా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రజలకు క్యాంపులపై పూర్తి
అవగాహన కల్పించాలన్నారు. శాచ్యురేషన్ పద్ధతిలో ఇప్పటికే ఈ ప్రభుత్వం నగరాలు,
పట్టణాలలో 87 శాతం మంది ప్రజలకు మేలు చేకూర్చిందని మల్లాది విష్ణు అన్నారు.
సాంకేతిక, మరే ఇతర కారణాలతో మిగిలిపోయిన అర్హులను కూడా జల్లెడ పట్టి మరీ
గుర్తించడమే కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కనుక ప్రతి పేదవాడికి మంచి
జరగాలన్న తపన, తాపత్రయంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఆశయాలకు అనుగుణంగా యంత్రాంగమంతా పనిచేయాలని కోరారు. ఎమ్మెల్యే వెంట
కార్పొరేటర్లు ఇసరపు దేవీ, యరగొర్ల తిరుపతమ్మ, పెనుమత్స శిరీష సత్యం, శర్వాణీ
మూర్తి, నాయకులు అలంపూర్ విజయ్, హఫీజుల్లా, ఇసరపు రాజారమేష్, మోదుగుల గణేష్,
ఉమ్మడి వెంకట్రావు ఉన్నారు.