అచ్చుతాపురం ఘటన దురదృష్టకరం..బాధ్యులపై చర్యలు
దిగ్భ్రాంతి వ్యక్తం చేసినముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
*మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్
విశాఖపట్నం : అచ్యుతాపురం సెజ్ లో సాహితీ ఫార్మా కంపెనీలో శుక్రవారం జరిగిన
ప్రమాదం చాలా దురదృష్టకరమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్
అన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న
క్షతగాత్రులను శుక్రవారం సాయంత్రం పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్నాథ్
పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి
తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాహితీ ఫార్మా కంపెనీలో ఉదయం
షిఫ్ట్ లో 35 మంది పనిచేస్తున్నారని కంటైనర్ లో సాల్వెంట్ లోడ్
చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగి మంటలు చెలరేగాయని చెప్పారు. ఈ ప్రమాదంలో
ఏడుగురికి తీవ్ర గాయాలు కాగా వీరిలో నలుగురిని కిమ్స్ ఆస్పత్రికి, ఇద్దరిని
కేజీహెచ్ కు, ఒకరిని అచ్చుతాపురం ఆసుపత్రికి తరలించారని మంత్రి పేర్కొన్నారు.
జిల్లాలో కాలిన గాయాలకు కేజీహెచ్ లో మెరుగైన చికిత్స లభిస్తుందందున కిమ్స్
లోని క్షతగాత్రులను కెజిహెచ్ కు తరలించినట్లు ఆయన తెలియజేశారు. సంఘటన పట్ల
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతికి గురయ్యారని చెప్పారు. ప్రమాదం
జరిగిన తీరుకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని బాధ్యులపై కఠిన చర్యలు
తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రమాదంలో జంగాలపాలెం చెందిన పైలా సత్తిబాబుకు 95
శాతం గాయాలు కావడంతో అతడు మరణించాడని, విజయనగరం జిల్లాకు చెందిన ఉప్పాడ
తిరుపతికి ఈ ప్రమాదంలో ఊపిరితిత్తులు దెబ్బతిని చనిపోయాడని మంత్రి అమర్నాథ్
తెలియజేశారు. కాగా భువనేశ్వర్ కు చెందిన రామేశ్వర్ 70 శాతం, అనకాపల్లి జిల్లా
రేబాకకు చెందిన సాగిరెడ్డి రాజాబాబు 60 శాతం, నక్కపల్లి కి చెందిన ఎస్.
అప్పారావు 55 శాతం గాయాలతో, పంచదారలకు చెందిన సింగంశెట్టి నూకనాయుడు 96
గాయాలతో కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.
జరిగిన ప్రమాదం గురించి ముఖ్యమంత్రికి వివరించగా మృతుల కుటుంబాలకు రూ. 25
లక్షల రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారని ఆయన తెలియజేశారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు
ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి చెప్పారు. క్షతగాత్రులకు ఇంకా మెరుగైన వైద్యం
కావాల్సి వస్తే ఎక్కడికైనా తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని కూడా
ఆయన తెలియజేశారు. జరిగిన ఘటనపై అధికారులతో సమీక్షిస్తున్నామని ఇది ఎవరి
నిర్లక్ష్యమని తెలినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అమర్నాథ్ స్పష్టం
చేశారు. ప్రభుత్వం ప్రమాదకర పరిశ్రమలపై ఎప్పటికప్పుడు సేఫ్టీ ఆడిట్
నిర్వహిస్తోందని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీఇటువంటి ప్రమాదాలు
చోటు చేసుకోవడం దురదృష్టకరమని అమర్నాథ్ అన్నారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా
మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేజిహెచ్
సూపరింటెండెంట్ డా. శివానంద, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.