హైదరాబాద్ : భద్రతా కారణాల దృష్యా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ప్రభుత్వం
‘వై’ కేటగిరీ భద్రతను కల్పించింది. ఈ మేరకు ఈటల భద్రతపై ప్రభుత్వం ఉత్తర్వులను
జారీ చేసింది. ఈటల రాజేందర్‌ను హత్య చేసేందుకు కుట్రపన్నారని ఆయన భార్య జమున
ఇటీవల ఆరోపించారు. అంతేకాకుండా ఈటల సైతం తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు.
కేంద్రం వై కేటగిరి భద్రత కల్పించే యోచనలో ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈటల
రాజేందర్ తనకు సోదరుడి లాంటి వాడని, ఆయనకు ప్రాణహాని ఉంటే రాష్ట్ర ప్రభుత్వం
తరఫున భద్రత కల్పిస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఈ మేరకు డీజీపీ
అంజనీ కుమార్‌కు సైతం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈటల రాజేందర్‌కు
ప్రాణహాని విషయంలో పూర్తి వివరాలు సమర్పించాలని మేడ్చల్ డీసీపీ సందీప్ రావును
డీజీపీ అంజనీ కుమార్ ఆదేశించారు. సందీప్ రావు నిన్న ఈటల రాజేందర్ ఇంటికి
వెళ్లి ఆయనను.. పలు విషయాలను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఆయన నివాసం
చుట్టుపక్కల ప్రాంతాలను సైతం డీసీపీ సందీప్ పరిశీలించారు. ఆ తర్వాత డీజీపీకి
నివేదిక అందించారు.
నివేదిక ఆధారంగా ఈటల రాజేందర్‌కు భద్రత కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
చేసింది. ఐదుగురు అంగరక్షకులు ఎప్పుడు ఈటల రాజేందర్ వెంట ఉంటారు. మరో ఆరుగురు
అంతర్గత భద్రత సిబ్బందిలో షిఫ్ట్‌కు ఇద్దరు చొప్పున మూడు షిఫ్టుల్లో విధుల్లో
ఉంటారు. దీనితో ఈటల ప్రాణాలకు హాని ఉందని తెలిసే ఇలా భద్రతను ఏర్పాటు చేశారని
హుజురాబాద్ శ్రేణులు భావిస్తున్నారు.
అసలేం జరిగింది : ఈటల రాజేందర్‌ను చంపేందుకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి రూ.20
కోట్లతో సుఫారీ హత్యకు ఫ్లాన్ చేస్తున్నారని ఈటల సతీమణి జమున సంచలన వ్యాఖ్యలు
చేశారు. తనకు భర్తకు, కుటుంబ సభ్యులకు ప్రాణ హాని ఉందని, తమకు ఏమైనా అయితే
సీఎం కేసీఆర్‌నే పూర్తి బాధ్యత వహించాలని ఆమె ధ్వజమెత్తారు. రాజేందర్‌ను
చంపేస్తామంటే ఎవరూ ఇక్కడ భయపడరని.. తాము నయీం బెదిరింపులకే భయపడలేదని
చెప్పారు. తనకు నాలుగైదు నెలలు నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు.
తాజా పరిణామాలపై కేంద్ర హోంశాఖ అప్రమత్తమయ్యింది. తనకు వై కేటగిరి భద్రతను
కల్పించాలని భావించింది. ఈలోపు మంత్రి కేటీఆర్‌నే చొరవ తీసుకొని డీజీపీతో
విచారణ జరిపించి వై కేటగిరి భద్రతను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.