గుంటూరు : ఇంటర్నెట్ వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ లో నిలిచిందని,
2023-23 సుస్థిర ప్రగతి లక్ష్యాల పురోగతి నివేదికలో ఈ విషయం వెల్లడయ్యిందని
రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి
పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా శనివారం పలు అంశాలు వెల్లడించారు.
నాలుగేళ్లలో రాష్ట్రంలో ఇంటర్నెట్ వినియోగం అత్యధికంగా పెరిగిందని, ప్రతి 100
మంది జనాభాకు 120.33 సబ్ స్క్రిప్షన్లు ఉన్నాయని అన్నారు. గడిచిన నాలుగేళ్లలో
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న
రాష్ట్రం సాంకేతిక ప్రగతి అందిపుచ్చుకొని ఇంటర్నెట్ వినియోగంలోనూ దేశంలోనే
అగ్రగామిగా నిలిచిందని అన్నారు.
జగనన్న సురక్ష పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా రూపొందించిన జగనన్న సురక్ష
కార్యక్రమంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఈ మేరకు ఎమ్మెల్యేలు,
పార్టీ నేతలు సురక్ష క్యాంపుల్లో క్రియాశీలకంగా పాల్గొని ప్రజలు సమస్యలు
పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని విజయసాయి రెడ్డి కోరారు.
విద్యారంగం, మానవ వనరులపై పెట్టుబడులు అత్యంత విలువైనవి
విద్యారంగం, మానవ వనరులపై పెట్టినంత గొప్ప పెట్టుబడులు ఇంకేవీ లేవని, మానవ
జాతి ఉజ్వల భవిష్యత్ వీటితోనే సాధ్యపడుతుందని విజయసాయి రెడ్డి అన్నారు. ఆంధ్ర
రాష్ట్రం చదువులపై చేస్తున్న ఖర్చును సైతం విపక్ష నేతలు సంస్కారం లేకుండా
విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయితే ప్రజలు అన్నీ నిశితంగా
గమనిస్తున్నారని ఆయన అన్నారు.
పచ్చదనం ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని పెంచుతుంది
పచ్చని ప్రదేశాల్లో నివసించే వారి వయసు రెండున్నరేళ్లు పెరుగుతుందని
అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధనలో తేలిందని విజయసాయి రెడ్డి
తెలిపారు. సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్లో ప్రచురించబడిన ఒక పరిశోధనా పత్రం
పచ్చని ప్రాంతాల్లో నివసించే ప్రజలు అనేక జీవ మరియు పరమాణు మార్పులకు
లోనవుతారని మరియు దీని కారణంగా వారి జీవసంబంధమైన వయస్సు తగ్గుతుందని
పేర్కొంది. జీవసంబంధమైన వయస్సును తగ్గించడం అంటే కాలక్రమానుసార వయస్సు/వాస్తవ
వయస్సు పెరగడం.అని అన్నారు మీ పరిసర ప్రాంతాల్లో చెట్లు మరియు మొక్కలు
నాటండి, పచ్చదనాన్ని పెంచండి, తద్వారా ఆరోగ్యం బాగుంటుంది. వయస్సు కూడా
పెరుగుతుందని ఆయన తెలిపారు
భారతీయ డాక్టర్లు నిస్వార్థ సేవకు చిరునామా
భారతదేశంలో డాక్టర్లు నిస్వార్ధంగా ప్రజలకు సేవలందించడంలో పెట్టింది పేరని ,
అందుకే డాక్టర్లకు ఇండియాలో దేవుడితో సమానంగా చూస్తారని విజయసాయి రెడ్డి
పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం జూలై 1, జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా వారికి
శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.