సీఎం కేసీఆర్ నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. గోదావరి పరివాహక
ప్రాంతంలో పరిస్థితులపై చర్చించేందుకు సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు.
గోదావరి పరివాహక ప్రాంతం పరిధిలోని మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు
సమావేశంలో పాల్గొననున్నారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగు, సాగు నీటి అవసరాలు, పరిస్థితులపై
ముఖ్యమంత్రి ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. గోదావరి పరివాహక
ప్రాంతంలో పరిస్థితులపై చర్చించేందుకు.. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం సచివాలయంలో
సమావేశం ఏర్పాటు చేశారు. గోదావరి పరివాహక ప్రాంతం పరిధిలోని మంత్రులు,
ప్రజాప్రతినిధులతో పాటు నీటిపారుదల శాఖ ఈఎన్సీలు, చీఫ్ ఇంజనీర్లు సమావేశంలో
పాల్గొననున్నారు.
గోదావరి పరిధిలోని ప్రాజెక్టులు, జలాశయాల్లో నీటి నిల్వలు, వర్షపాతం, తాగు,
సాగు నీటి అవసరాలు తదితరాలపై పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు.
వర్షాలు, ఎగువ నుంచి వచ్చే ప్రవాహాలు, పరిస్థితులపై కూడా చర్చిస్తారు. ఆయా
జలాశయాల్లో ప్రస్తుతం ఉన్న నీటి పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకొని తాగు, సాగు
నీటి అవసరాలపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు వాతావరణ శాఖ అంచనాల మేరకుజులై
మొదటి వారం వరకు వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో
తాగునీటి కోసం ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలే దానిపై కూడా
సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
జూన్ గడిచినా కనుకరించని వరుణుడు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది రైతులందరూ ముందస్తు సాగు వైపు మొగ్గు చూపాలని
పిలుపిచ్చిన విషయం తెలిసిందే. తద్వారా జరిగే ఆవశ్యకతను వివరించిన సీఎం…
వ్యవసాయ శాఖ ఈ దిశగా రైతులను చైతన్యపరచాలని ఆదేశించారు. ఈ క్రమంలో రైతులు
ఇప్పటికే పంట పొలాలు సిద్ధం చేసుకుని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. జూన్
నెల నిరాశపర్చింది. గత నెలలో 131.4 మిల్లీమీటర్లకు గాను 65.2 మిల్లీమీటర్లే
(-50 శాతం) వర్షపాతం నమోదైంది. కొన్ని జిల్లాల్లో అతి తక్కువగా కురిసింది. గత
నెలలో 96 శాతం సాధారణ వర్షపాతం ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేయగా, ఎల్నినో
ప్రభావంతో పరిస్థితులు అనుకూలించలేదు. జూన్ 12లోగా రుతుపవనాలు రాష్ట్రాన్ని
తాకాల్సి ఉండగా 21వతేదీకి గానీ రాలేదు. అందరి ఆశలూ జులైపైనే ఉన్నాయి. ఈనెలలో
సాధారణ వర్షపాతం 96 శాతం నమోదవ్వచ్చన్నది వాతావరణశాఖ అంచనా.
18 జిల్లాల్లో 50 శాతానికిపైగా లోటు వర్షపాతం
రాష్ట్రంలో జూన్ వర్షపాత గణాంకాలను పరిశీలిస్తే 17 జిల్లాల్లో 50 శాతానికి
పైగా లోటు వర్షపాతం నమోదైంది. పెద్దపల్లి జిల్లాలో -77 శాతం లోటు నమోదయింది.
కరీంనగర్ -74, జగిత్యాల -72, భూపాలపల్లి -73, హనుమకొండ -72, వరంగల్ -70,
ములుగు -69, ఆదిలాబాద్ -64, నిర్మల్ -62, ఖమ్మం -62, సిరిసిల్ల -59,
మంచిర్యాల -53, భద్రాద్రి -55, కామారెడ్డి -56, మహబూబాబాద్ -53, నిజామాబాద్
-55, నల్గొండలో 51 శాతం లోటు వర్షపాతం ఉంది. మిగిలిన జిల్లాల్లో నారాయణ పేటలో
అతి తక్కువగా -6 శాతం, యాదాద్రిలో -13 శాతం లోటు వర్షపాతం నమోదయింది.