ముంబయి : మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీలో
విపక్షనేతగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత అజిత్ పవార్
అధికార పక్షంలో చేరారు. ముఖ్యమంత్రి శిందేతో భేటీ అనంతరం తన మద్దతుదారులు 9
మందితో కలిసి గవర్నర్‌ను కలిశారు. వెనువెంటనే మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా
ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతోపాటు ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వాల్సే పాటిల్,
ధర్మారావ్ అట్రాం, సునీల్ వాల్సడే, అదితి ఠాక్రే, హసన్ ముష్రీఫ్, ధనుంజయ్
ముండే, అనిల్ పాటిల్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు పార్టీ
ఎమ్మెల్యేలు, నేతలతో విడిగా అజిత్‌పవార్ తన స్వగృహం దేవగిరిలో సమావేశం
నిర్వహించారు. ఈ సమావేశంలో శరద్ పవార్కుమార్తె సుప్రియా సూలే సహా పలువురు
ఎన్సీపీ నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశం నుంచి సుప్రియ అర్ధంతరంగా బయటకు
వెళ్లిపోయారు. అనంతరం అజిత్ పవార్ రాజ్‌భవన్‌కు తరలివెళ్లగా సీఎం ఏక్నాథ్
శిందే సైతం అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే అజిత్‌కు ఉపముఖ్యమంత్రి పదవి
కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష
నేత పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు అజిత్ ప్రకటించిన కొన్ని రోజులకే
ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఎన్సీపీ కీలక నేతగా ఉన్న అజిత్ పవార్
2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో చేతులు కలిపారు. దేవేంద్ర
ఫడణవీస్ సీఎంగా, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా నవంబర్ 23న ఉదయాన్నే
గవర్నర్ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేయడం అందరినీ షాక్‌కు గురిచేసిన విషయం
తెలిసిందే. ఈ వ్యవహారం మహా రాష్ట్రరాజకీయాల్లో అప్పట్లో సంచలనంగా మారింది. ఆ
తర్వాత కొద్ది రోజులకే ఆ ప్రభుత్వం కుప్పకూలింది. ఈ క్రమంలో విపక్ష నేతగా ఉన్న
అజిత్ అనూహ్య నిర్ణయంతో ప్రభుత్వానికి మద్దతు తెలపడం విశేషం. మహారాష్ట్ర
అసెంబ్లీలో ఎన్సీపీకి ప్రస్తుతం 53 మంది సభ్యులున్నారు. వారిలో దాదాపు 30 మంది
అజిత్ పవార్‌కు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం.