కాంగ్రెస్ వాపును చూసి బలుపు అనుకుంటుంది
కర్ణాటక గెలుపుతో తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం అయ్యిందని భ్రమలు
కల్పిస్తున్నారు
బీజేపీ అంటే బడా జూటా పార్టీ
రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులను కూడా మేమే చేశామని అసత్య ప్రచారం చేస్తున్నారు
మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డే అని ముద్దాడటం వారికి అలవాటే
తెలంగాణపై మోడీ ప్రభుత్వం వివక్ష చూపుతోంది
తెలంగాణ కు హక్కుగా రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు గుజరాత్,ఉత్తర ప్రదేశ్
లాంటి రాష్ట్రాలకు అన్యాయంగా తరలిస్తుంటే ఇక్కడి బీజేపీ ఎంపీలు చోద్యం
చూస్తున్నారు
వారికి రాజకీయాలు తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాలు పట్టవు
బాల్కొండ అభివృద్ది పరంపర ఎవరూ ఆపలేరు
నా మీద ఎన్ని అసత్య ఆరోపణలు సృష్టిస్తే అంతకు రెట్టింపు అభివృద్ది చేసి
చూపిస్తా
పార్టీ జాయినింగ్స్ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ది కేసిఆర్ తోనే సాధ్యమని రాష్ట్ర రోడ్లు భవనాల
శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
ముఖ్యమంత్రి కేసిఆర్ జనరంజక పాలన,బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న
అబివృద్దికి ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండలంలోని భీంగల్,
ముచ్కూర్,బాబాపూర్ గ్రామాల నుంచి బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు
నాయకులు,యువకులు హైదరాబాద్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్
పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా
ఆహ్వానించారు. ఇవాళ్టి నుంచి మీరు నా కుటుంబ సభ్యులని అన్ని విధాల అండగా
ఉంటానని వారితో అన్నారు.
పార్టీలో చేరిన వారిలో
భీంగల్ నుండి కర్నె సత్య గంగయ్య – కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు,
జిల్లా పార్టీ కార్యదర్శి మాసం మధు – బీజేపీ, చింతకుంట సాయి – బీజేపీ
అనుచరులు, ముచ్కూర్ గ్రామం నుండి బిసిరి బాల కృష్ణ వారి అనుచరులు, బాబాపూర్
గ్రామం నుండి ధరణి కోట అశోక్ – కాంగ్రెస్ మాజి ఉప సర్పంచ్ ఆయన అనుచరులు ఇలా
సుమారు 50 మంది వరకు మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారిని
ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో, బాల్కొండలో
జరుగుతున్న అభివృద్ది చూసి కేసిఆర్ కి తనకు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీలో చేరిన
వారికి మంత్రి సాదర స్వాగతం తెలుపుతున్న అని అన్నారు. కష్ట సుఖాల్లో తోడుగా
ఉంటానని భరోసా ఇచ్చారు. బీజేపీ,కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో
లేరన్నారు. కేసిఆర్ కంటే 10 ఏళ్ల ముందు కాంగ్రెస్ అధికారంలో ఉండే
కదా..రైతులు,పేదల కోసం ఏం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలన ఏంటో తెలంగాణ
ప్రజలకు తెలుసని,కాంగ్రెస్ వాపును చూసి బలుపు అనుకుంటుందని ఎద్దేవా చేసారు.
కర్ణాటక గెలుపుతో తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతం అయ్యిందని భ్రమలు
కల్పిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాచికలు తెలంగాణలో పారవన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏమీ ఇయ్యక పోగా అన్ని
మేమే చేస్తున్నామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ
అంటేనే బడా జూటా పార్టీ అని విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా
మొదలుకొని రాష్ట్రంలోని బీజేపీ మండల అధ్యక్షుడి వరకు నోరు తెరిస్తే
అబద్ధాలు,అసత్యాలే మాట్లాడుతున్నారని మండిపడ్డారు.రాష్ట్ర ప్రభుత్వం చేసిన
పనులను కూడా మేమే చేశామని అసత్య ప్రచారం చేస్తున్నారని,మందికి పుట్టిన బిడ్డ
మా బిడ్డే అని ముద్దాడటం వారికి అలవాటే అని ఎద్దేవా చేసారు. కేసిఆర్ తెలంగాణలో
అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా ఎందుకు అమలు
చేయలేకపోతున్నారని మంత్రి బీజేపీ నేతలను నిలదీశారు. తెలంగాణపై మోడీ ప్రభుత్వం
వివక్ష చూపుతోందన్నారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన ప్రాజెక్టులు,నిధులు
గుజరాత్,ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు అన్యాయంగా తరలిస్తుంటే ఇక్కడి బీజేపీ
ఎంపీలు చోద్యం చూస్తున్నారని,వారికి రాజకీయాలు తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాలు
పట్టవని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ,కాంగ్రెస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా
ఉండాలని కోరారు. కేసిఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని మంత్రి పునరుద్ఘాటించారు.
నా మీద ఎన్ని అసత్య ఆరోపణలు సృష్టిస్తే అంతకు రెట్టింపు అభివృద్ది చేసి
చూపిస్తా..
బాల్కొండ నియోజకవర్గాన్ని ముఖ్యమంత్రి కేసిఆర్ గారి సహకారంతో అన్ని విధాల
అభివృద్ది చేసుకున్నామని,బాల్కొండ అభివృద్ది పరంపర ఎవరూ ఆపలేరని మంత్రి వేముల
స్పష్టం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అబివృద్ది కండ్ల ముందే
కనిపిస్తుందన్నారు. సాగునీటి రంగంలో ఎస్సారెస్పీ పునరుజ్జీవనం ద్వారా,21
ప్యాకేజీ ద్వారా,మిషన్ కాకతీయ ద్వారా,చెక్ డ్యాం ల ద్వారా,24 గంటల నాణ్యమైన
కరెంట్ ఇస్తూ..బి.టి రోడ్లు,సి.సి రోడ్లు,వాగుల మీద బ్రిడ్జిలు, అన్ని మండల
కేంద్రాల్లో రోడ్ వెడల్పు,సెంట్రల్ లైటింగ్ ఇలా వందల కోట్లతో ఎంతో అభివృద్ధి
చేసుకుంటున్నామని వివరించారు. తాను నియోజకవర్గ అభివృద్ది కోసం తాపత్రయ
పడుతుంటే నా మీద ప్రతిపక్షాలు ప్రెస్ మీట్లు పెట్టిమరి బురద జల్లే నిరాధార
ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను ఏమనకుంటే కొద్దిగా సైలంట్
గా వెళ్తా…కానీ నా మీద ఎన్ని అసత్య ఆరోపణలు సృష్టిస్తే…అంతకు రెట్టింపు
అభివృద్ది చేసి చూపిస్తా అని సవాల్ చేశారు. ఎంత అబద్ధాలు ప్రచారం చేస్తారో..
జిద్దుగా తీసుకొని అంతకు మూడు రెట్లు అభివృద్ది చేస్తూ సమాధానం చెప్తానని
బీజేపీ,కాంగ్రెస్ నేతలకు మంత్రి ఘాటుగా చురకలంటించారు. ఈ కార్యక్రమంలో
బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా. మధు శేఖర్,రాజారాం యాదవ్, భీంగల్ మండల
ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.