మంత్రివర్గంలోకి ఫడణవీస్, పలువురు కీలక నేతలు..?
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే కీలక మార్పులు చేసుకుంటాయనే
వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన
జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంపై ఆసక్తి నెలకొంది. కేంద్ర మంత్రివర్గంలో
త్వరలోనే కీలక మార్పులు చేసుకుంటాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా
వచ్చే ఏడాదిలో జరిగే సార్వత్రిక ఎన్నికలతోపాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ
ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర కేబినెట్లో పలువురికి అవకాశం
కల్పించనున్నారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం ప్రధాని
నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగనున్న కేంద్ర కేబినెట్ భేటీపై ఆసక్తి నెలకొంది.
ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్లో కేబినెట్ సమావేశం
కానున్నట్లు సమాచారం. బీజేపీ సీనియర్ నేతలతో బుధవారం అర్ధరాత్రి ప్రధాని
మోడీ తన నివాసంలో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. షా, నడ్డా, సంతోష్‌లు
కొద్దిరోజులుగా విడతలవారీగా చర్చలు సాగిస్తూ వస్తున్నారు. జూన్ 28న
ప్రత్యేకంగా సమావేశం కావడంతో కేబినెట్ విస్తరణపై కసరత్తు జరుగుతోందనే వార్తలు
మొదలయ్యాయి. ఈ తరుణంలోనే మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు
చోటుచేసుకున్నాయి. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ నేతృత్వంలోని పలువురు
ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
కేంద్రంలోకి ఫడణవీస్..? : ఎన్సీపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ప్రఫూల్
పటేల్‌కు కేంద్ర కేబినెట్లో చోటు కల్పించవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి.
మరోవైపు అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ప్రస్తుతం
డిప్యూటీ సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడణవీస్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి
తీసుకోవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరితోపాటు ఎన్డీఏ భాగస్వామ్య
పక్షాలకు కేబినెట్లో మరింత అవకాశం కల్పించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు
పేర్కొంటున్నాయి. సాధారణ మంత్రివర్గ సమావేశాల్లో కేబినెట్ మంత్రులు
పాల్గొంటారు. అవసరమైనప్పుడు స్వతంత్ర హోదాలో ఉన్న సహాయ మంత్రులూ
పాలుపంచుకుంటుంటారు. సహాయ మంత్రులకు అందులో పాల్గొనే అవకాశం ఉండదు. కానీ
మంత్రిమండలి సమావేశంలో మొత్తం మంత్రివర్గం పాల్గొననుంది. జులై 20నుంచి
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు వచ్చే ఏడాది
సార్వత్రిక ఎన్నికలతోపాటు ఈ ఏడాది చివరలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు
జరగనున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, తెలంగాణ,
మిజోరాంలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నుంచి
గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ నేపథ్యంలో పలు అంశాలను దృష్టిలో ఉంచుకొని
కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.