విజయనగరం : స్వర్గస్థులైన మహనీయుల త్యాగాలు, వారి జీవిత చరిత్రలను
నేటి తరం వారు తెలుసుకొని స్ఫూర్తి పొందడానికే వారి విగ్రహాలు ఏర్పాటు
చేసుకుంటున్నామని చెప్పారు. తెలుగు వారందరి హృదయాల్లో సుస్థిర స్థానం
ఏర్పరచుకున్న మహనీయుడు అల్లూరి సీతారామరాజు అని ఉప సభాపతి కోలగట్ల
వీరభద్రస్వామి అన్నారు. అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వేడుకలు జిల్లా
యంత్రాంగం, అల్లూరి సేవా సమితి ఆధ్వర్యంలో దాసన్నపేట రింగు రోడ్డులోని
అల్లూరి కూడలి వద్ద మంగళవారం నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల
వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్, మేయర్
వి.విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ లయ యాదవ్, జిల్లా రెవిన్యూ అధికారి
ఎం.గణపతిరావు తదితరులు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు
వేసి నివాళులర్పించారు. అల్లూరి చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి స్పీకర్
జయంతి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ
స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ పాలకులకు ఎదురొడ్డి నిలిచి ప్రాణత్యాగం చేసిన
మహనీయుడు అల్లూరి అని పేర్కొంటూ ఘన నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్య్రం
కోసం మహాత్మా గాంధీ, ఆజాద్, సుభాష్ చంద్రబోస్ వంటి ఎందరో సమరయోధులు
వేర్వేరు పద్ధతుల్లో పోరాటాలు చేశారని, అల్లూరి కూడా సాయుధ పద్ధతుల్లో
బ్రిటిష్ వారిని ఎదురొడ్డి వారికి సవాల్‌గా నిలిచారని పేర్కొన్నారు. వారి
స్ఫూర్తితో ఎందరో స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారని గుర్తుచేశారు.
రాష్ట్రంలో అతిపెద్ద అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి
శ్రీ జగన్‌దేనని చెప్పారు. ఎందరో సమరయోధుల త్యాగాలతో సాధించిన
స్వాతంత్య్ర ఫలాలను సమాజంలో అన్ని వర్గాలకు సమానంగా అందజేసే లక్ష్యంతో
ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. దీనిలో
భాగంగానే అందరికీ విద్య, వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టారని
తెలిపారు. అవినీతి, లంచగొండతనానికి తావులేని విధంగా పారదర్శకంగా
కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. నగరంలో దాసన్నపేట
రింగురోడ్డులో అల్లూరి విగ్రహం ఏర్పాటుచేసి కూడలికి ఆయన పేరిట నామకరణం
చేయాలని కోరిన మీదట గత ఏడాది అల్లూరి కూడలిగా నామకరణం చేశామన్నారు.
గిరిజన విద్యార్ధులకు ఆర్ధిక సహాయం అందిస్తూ నగదు పారితోషికాలు
అందజేసేందుకు అల్లూరి సేవా సమితి ముందుకు రావడంపై అభినందించారు. రానున్న
రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలను పేదల కోసం చేపట్టాలని కోరారు.
విగ్రహం ఏర్పాటు చేసిన కూడలిని శాశ్వతంగా నిర్వహణ చేపట్టేందుకు వచ్చిన
పోర్టు సిటీ స్కూల్ యాజమాన్యాన్ని, స్కూల్ ఛైర్మన్ కె.ఏ.ఆర్.రాజు(శివ) ను
అభినందించారు. అల్లూరి సేవాసమితి ద్వారా ఎస్.కోట, అనంతగిరి,
రామభద్రపురం మండలాలకు చెందిన నలుగురు గిరిజన విద్యార్ధులకు
ఒక్కొక్కరికి రూ.5000 వంతున నగదు పారితోషికాన్ని అందజేశారు. జిల్లా
రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు మాట్లాడుతూ నాటి సమరయోధులు ఎంతో పోరాడి
సాధించిన స్వాతంత్య్ర పరిమళాల విలువ నేటి తరం వారికి తెలియాల్సి వుందని
పేర్కొన్నారు. నగర మేయర్ వి.విజయలక్ష్మి మాట్లాడుతూ అల్లూరిని
స్ఫూర్తిగా తీసుకొని యువత ముందంజ వేయాలన్నారు. డిప్యూటీ మేయర్ లయ యాదవ్,
పర్యాటక అధికారి లక్ష్మీనారాయణ, సహాయ మునిసిపల్ కమిషనర్
ప్రసాదరావు, కార్పొరేటర్ మురళి, అల్లూరి సేవాసమితి ప్రతినిధులు సుధాకర్
రాజు, శివాజీ, రామరాజు, రాంబాబు, సూర్యనారాయణరాజు, జి.ఎస్.ఎన్.రాజు,
వర్మ రాజు తదితరులు పాల్గొన్నారు.