97 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ
మున్సిపల్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
హోంమంత్రి
కొవ్వూరు : కనీస నివాస స్థలం, ఇల్లు లేని పేదలందరికీ శాశ్వత ప్రాతిపదికన గృహ
వసతి కల్పించాలనే లక్ష్యంతో జగనన్న ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర
హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు.
బుధవారం కొవ్వూరు మున్సిపాలిటీ ఆవరణలో నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ
కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు క్లీన్
ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి నుండి తడి, పొడి చెత్తలను సేకరించే
ఎలక్ట్రిక్ ఆటో(ఈ-ఆటో)లను జెండా ఊపి ప్రారంభించారు. కాసేపు ఈ-ఆటోలో
ప్రయాణించారు. దాదాపు 45 లక్షల విలువ గల 10 ఈ-ఆటోలను ఆమె ప్రారంభించిన అనంతరం
90 రోజుల్లో ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా 97 మంది లబ్ధిదారులు ఇళ్ల పట్టాలను
హోంమంత్రి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత
మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుందని, జగనన్న కాలనీల
నిర్మాణంతో ఊళ్లకు ఊళ్లు ఏర్పడుతున్నాయన్నారు. ఇళ్లు లేని పేదలు ఎవరూ
ఉండకూడదని ఇప్పటికే 33 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. జగనన్న
ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 25 లక్షల మందికి ఇళ్లు ఇస్తామని
చెప్పినప్పటికీ.. మ్యానిఫెస్టోలో చెప్పిన దానికంటే మిన్నగా అమలు చేశామన్నారు.
అయినప్పటికీ అర్హులెవరైనా ఉంటే మిగిలిపోకూడదని 90 రోజుల్లో ఆన్ లైన్ చేయించి
ఇళ్ల పట్టాలను అందిస్తున్నామన్నారు. పేదలందరికీ ఇళ్ళ స్థలాలు కేటాయించడంతో
పాటు పక్కా గృహాలను నిర్మించుకునేందుకు వీలుగా ఒక లక్షా 80 వేల రూపాయలు
ఉచితంగా అందించడంతో పాటు డ్వాక్రా మహిళలకు బ్యాంకు లోన్లు మంజూరు
చేయిస్తున్నామని వివరించారు. అలాగే లబ్ధిదారులపై ఆర్థిక భారాన్ని
తగ్గించేందుకుగాను ఉచితంగా ఇసుక అందించడంతో పాటు మార్కెట్ ధరల కంటే గణనీయంగా
తక్కువ ధరకు సిమెంట్ & స్టీల్ ను ప్రభుత్వమే సరఫరా చేయడం జరుగుతోందన్నారు.
కొవ్వూరు మున్సిపాలిటీ పరిధిలో 3,375 ఇళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఇవేకాక
టిడ్కో ఇళ్ల నిర్మాణంపై కూడా ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తో
సమీక్ష నిర్వహించామని.. 2, 3 నెలల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం కూడా పూర్తవుతుందని
హోంమంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ
ప్రసాద్, మున్సిపల్ చైర్ పర్సన్ భావన రత్నకుమారి, మాజీ ఎమ్మెల్సీ శివరామకృష్ణ,
కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.