ఏపీలో ముందస్తు ఎన్నికలపై మరో సారి విస్తృత స్థాయి చర్చలకు తెర
విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో
ఉన్నారా? అంటే…ఔననే సమాధానం వైసీపీ వర్గాల నుంచి వస్తోంది.
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ముందస్తు ఎన్నికలకు
వెళ్లాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారని, ఎన్నికలు
ఎప్పుడొచ్చినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని ఇటీవల చంద్రబాబునాయుడు
రాజకీయ కోణంలో అన్నారు. అయితే ఆయన మాటల్లో నిజం లేకపోలేదు. ముఖ్యమంత్రి
వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ముందస్తు ఎన్నికలపై సాగుతున్న
ప్రచారానికి బలం కలిగింది. ఇటీవల జగన్ ఢిల్లీకి వెళ్లి వచ్చారు.
అప్పుడు తన తమ్ముడు వైఎస్ అవినాష్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయకుండా
అడ్డుకునేందుకు కేంద్ర పెద్దల ప్రసన్నం కోసం వెళ్లారనే ప్రచారం
జరిగింది. అయితే ప్రత్యర్థుల ఆరోపణల్లో నిజం లేదు. ఒకట్రెండు ముఖ్యమైన
పనులపై ఆయన ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ తో భేటీ అయ్యారు. ఒక రాజ్యాంగ
వ్యవస్థలోని వ్యక్తి అతి ఎక్కువ కావడంతో, అతన్ని సాగనంపేందుకు జగన్
చేసిన ప్రయత్నాలు సత్ఫలితం ఇచ్చింది. అలాగే పోలవరానికి సంబంధించి నిధుల
కోసం వెళ్లారు. అది కూడా కొంత వరకూ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు
తెలిసింది. ఇదిలా వుండగా మరోసారి జగన్ వెళ్లడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర
చర్చనీయాంశమైంది. ప్రత్యర్థుల దృష్టి అంతా జగన్ పర్యటనపై ఉంది.
కేవలం రెండు వారాల వ్యవధిలోనే జగన్ ఢిల్లీ వెళ్లడం, ప్రధానితో పాటు
కేంద్రమంత్రులను కలవాలని నిర్ణయించుకోవడం వెనుక కారణాలు ఏవై ఉంటాయనే
చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. వైఎస్ జగన్ నిర్ణయాలు ఒక్కో సారి షాక్‌కు
గురి చేస్తుంటాయి. తన మనసులో ఏముందో ఎవరికీ అంతుచిక్కనివ్వరు. జగన్
చర్యలు మాత్రమే మాట్లాడుతూ వుంటాయి.
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని జగన్ లైట్ తీసుకున్నారని
వైసీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నప్పటికీ, అది నిజం కాదనే ప్రచారం
జరుగుతోంది. మరోవైపు పార్టీలో నిరసన గళాలు పెరిగే సూచనలు స్పష్టంగా
కనిపిస్తున్నాయి. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే, ప్రత్యర్థులకు ఏ మాత్రం
సమయం ఇవ్వకుండా చావుదెబ్బ తీయాలనే వ్యూహంతో జగన్ ముందస్తు ఆలోచన
చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికలకు ఇంకా పది నెలల
సమయం మాత్రమే వుంది. ఈ గడువు ప్రకారం ఎన్నికలకు వెళితే టీడీపీ,
జనసేన చక్కగా పొత్తులు కుదుర్చుకుని, తమపై ఎదురు దాడికి
అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటాయని జగన్ లెక్కలేసుకుంటున్నారు. తన
ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్న మాట నిజమేనని, అయితే ఆ రెండు పార్టీలు
కలవనీయకుండా ఎన్నికలకు వెళితే, మరోసారి అధికారాన్ని దక్కించుకోవడం
సులువని జగన్ ఆలోచనగా చెబుతున్నారు.
జగన్ ముందస్తు ముచ్చట : వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం కోల్పోతే ఏం జరుగుతుందో
ఏపీలో హేతువుతో సంబంధం లేకుండా సాగుతున్న ఊహాగాన సభలను గమనిస్తు ఇట్టే
అర్ధమైపోతుంది. ఈ ఏడాది చివరిలో దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు
జరగనున్నాయి. ఆ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సన్నాహాలు
చేస్తోంది. ఇక రెండు మూడు నెలలలో షెడ్యూల్ విడుదల కూడా జరిగిపోతుంది. అయినా
ఏపీలో ముందస్తు ముచ్చటకు సంబంధించిన ఊహాగానాలూ, అంచనాలూ ఇసుమంతైనా ఆగడం లేదు.
ఏపీ సీఎం స్వయంగా ముందస్తు ప్రశ్నే లేదు. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్ర
అసెంబ్లీకి ఎన్నికలు అని విస్పష్టంగా ప్రకటించినా పరిశీలకుల నుంచి, రాజకీయ
విశ్లేషకుల దాకా, సామాన్య జనం నుంచి ప్రతి పక్ష పార్టీల వరకూ ఏపీలో ముందస్తు
ఖాయమంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారు.
తాజాగా మరో మారు ఏపీలో ముందస్తు ఎన్నికలపై మరో సారి విస్తృత స్థాయి చర్చలకు
తెరలేచింది. ఇందుకు కారణం ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ హస్తిన పర్యటన.
అంతే కాకుండా మోడీ కూడా ముందస్తు యోచన చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో జగన్
పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏపీ
తన అప్పుల పరిమితి దాదాపు వాడేసుకుంది.
ఎడాపెడా అప్పులు, కేంద్రం నుంచి ఉదారంగా నిధులూ వచ్చినా కూడా ఆగస్టు నుంచి
ఉద్యోగుల జీతాలే కాదు, బటన్ నొక్కుడు సంక్షేమానికీ ఇబ్బందులు తప్పవు. దీంతో
జగన్ కేంద్రం వద్ద మీరు ఆదుకోవాలి అంటూ వేడుకోవడం, అలాగే దీపం ఉండగానే ఇళ్లు
చక్కపెట్టుకుంటాను. ముందస్తుకు అవకాశం ఇవ్వండి అని విజ్ణప్తి చేయడం వినా మరో
గత్యంతరం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2014 ఎన్నికలలో తన పార్టీని
విజయ పథంలో నడిపించి ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన బీఆర్ఎస్ (అప్పుడు
టీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ తరువాత చుట్టూ సమస్యలు
చుట్టుముట్టడంతో వ్యూహాత్మకంగా 2019 వరకూ ఆగకుండా ఆర్నెళ్లు ముందే ముందస్తు
ఎన్నికలకు వెళ్లి 2018లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే ఈ సారి
మాత్రం ఆయన అంతే వ్యూహాత్మకంగా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు వెడుతున్నారు. ఇక
జగన్ విషయానికి వస్తే 2019 ఎన్నికలలో ఘన విజయం సాధించిన ఆయన నాలుగేళ్లలోనే
అంతులేనంత ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న
పరిస్థితులు, ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలలో తీవ్రంగా ఉన్న ప్రభుత్వ
వ్యతిరేకత రోజు రోజుకూ పెరుగుతున్నదే కానీ తగ్గడం లేదు. అలా తగ్గే
పరిస్థితులు కూడా కనిపించడం లేదు. సంక్షేమం అంటూ బటన్లు నొక్కి లబ్ధి దారుల
ఖాతాలలో సొమ్ములు వేస్తున్నా ఎక్కడా సంతృప్తి అన్నది ప్రజలలో మచ్చుకైనా
కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో బటన్ నొక్కుడు కూడా కష్టమయ్యేలా భవిష్యత్
అద్దంలో కనిపిస్తుండటంతో జగన్ లో ఆందోళన పెరుగుతోంది. దీంతో షెడ్యూల్ వరకూ
వేచి చూడాలని ఆయన భావిస్తున్నా ముందస్తుకు వెళ్లకుంటే మొదటికే మోసం వస్తుందన్న
ఆందోళనా ఆయనను వెన్నాడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.