హంపి : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హంపీలోని ఏకశిలా రథానికి కేంద్ర పురావస్తుశాఖ
వారు మరింత భద్రత కల్పించారు. మూడేళ్ల కిందట హంపీ రాతిరథం చుట్టూ ఇనుప
చువ్వలను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కొందరు పర్యాటకులు, సందర్శకులు ఇనుప
చువ్వల కింద నుంచి దూరి రాతిరథం తాకేవారు. అక్కడ నిల్చుని స్వీయ చిత్రాలు
తీసుకోవడం ప్రారంభించారు. ఈ నెల 9 నుంచి 16 వరకు హంపీలో జీ-20 సదస్సు
జరుగనుంది. పెద్ద సంఖ్యలో సందర్శకులు, పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది. ఈ
నేపథ్యంలో కేంద్ర పురావస్తుశాఖ వారు ఏకశిలా రథం చుట్టూ దుంగలతో కూడిన ప్రహరీ
ఏర్పాటు చేశారు. ఏకశిలా రథం దగ్గిరకి కూడా వెళ్లకుండా చర్యలు చేపట్టారు.
సుమారు పది అడుగుల దూరం నుంచే ఏకశిలా రథాన్ని చూసి ఆనందించాలి.
ప్రత్యేకతల సమాహారం: హంపీ సందర్శనకు వచ్చినవారు ఒకటిరెండు స్మారకాలను చూడటం
మరచిపోతారేమోగాని, ఏకశిలా రథాన్ని చూడకుండా వెళ్లరు. సమయాభావం ఉన్న చాలా మంది
పర్యాటకులు ఏకశిలా రథాన్ని మాత్రమే చూసి వెళ్లిపోతారు. హంపీలో ఉన్ని ఏకశిలా
రథానికి అంతటి ప్రాధాన్యం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా యాభై రూపాయల నోటుపైన
రాతిరథం చిత్రాన్ని ముద్రించడం తెలిసిందే. ఇన్నేళ్లు ఏకశిలా రథం చూడటానికి
వచ్చిన సందర్శకులు, దానిపై ఎక్కి ఫొటోలు తీసుకోవడం, చక్రాల నడుమ కూర్చోవడం ఇలా
పలు కోణాల్లో ఫొటోలు, స్వీయ చిత్రాలను తీసుకునేవారు. ఆ స్మారకానికి హాని
కలుగుతుందని నిపుణులు తేల్చిచెప్పడంతో మూడేళ్ల కిందట ఇనుపచువ్వలు, ఇప్పుడు
దుంగలతో ప్రహరీ నిర్మించి భద్రత కల్పిస్తున్నారు.