30 వ డివిజన్ 246 వ సచివాలయ పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ సెంట్రల్ : జనసంక్షేమమే ఏకైక లక్ష్యంగా ముందుకుసాగుతున్న వైఎస్సార్
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి అపూర్వ మద్దతు లభిస్తోందని ప్లానింగ్
బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 30 వ
డివిజన్ 246 వ వార్డు సచివాలయ పరిధిలో గురువారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం
కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.
దేవీనగర్ లో విస్తృతంగా పర్యటించి 259 గడపలను సందర్శించారు. ఏ కుటుంబానికి
ఎంతెంత లబ్ధి చేకూరిందో వివరిస్తూ.. ప్రభుత్వ పథకాలు వారు మరింత సద్వినియోగం
చేసుకునేలా అవగాహన కల్పించారు. ఇంటింటికీ తిరిగి సమస్యలు తెలుసుకుని సత్వర
పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు.
>
నాలుగేళ్లలో రూ. 23 కోట్ల అభివృద్ధి : గత తెలుగుదేశం పాలకులు డివిజన్
అభివృద్ధిపై కనీసం చిత్తశుద్ధి చూపలేదని మల్లాది విష్ణు విమర్శించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధిని
కళ్లకు కట్టినట్లు చూపడం జరుగుతోందన్నారు. డివిజన్ సమగ్రాభివృద్ధి కోసం
నాలుగేళ్లలో రూ. 23 కోట్లు వెచ్చించగా కేవలం రోడ్ల నిర్మాణానికే రూ. 9 కోట్లు
కేటాయించినట్లు చెప్పారు. రామకృష్ణాపురం నుంచి దేవీనగర్ వరకు ప్రధాన రహదారిని
పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. దేవీనగర్,
దావుబుచ్చయ్య కాలనీ, ఉలవచారు కంపెనీ మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు ప్రధాని
రహదారి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నట్లు వివరించారు. అలాగే ఆర్.యు.బి. పనులు
చురుగ్గా జరుగుతున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. ఈ ప్రాంత ప్రజల తాగునీటి
అవసరాల నిమిత్తం గద్దె వెంకట్రామయ్య నగర్లో రూ.7.45 కోట్ల వ్యయంతో చేపట్టిన
1,500కేఎల్ రిజర్వాయర్ నిర్మాణం, పంపింగ్ మెయిన్ పైపులైన్ పనులు సైతం
శరవేగంగా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. రూ. 80 లక్షల వ్యయంతో దేవీనగర్లో
నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ ను త్వరలోనే ప్రారంభించి.. ప్రజలకు ఆరోగ్య
సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు. 2014-19 మధ్య
కాలంలో ఇటువంటి అభివృద్ధి పనులు ఎందుకు చేపట్టలేకపోయారో గత టీడీపీ పాలకులు
సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వ్యాపారస్తులపై నారా లోకేష్ ది కపట ప్రేమ : వ్యాపారస్తుల గూర్చి మాట్లాడే
నైతిక అర్హత టీడీపీ నేతలకు ఏమాత్రం లేదని మల్లాది విష్ణు అన్నారు. గత
తెలుగుదేశం ప్రభుత్వంలో వ్యాపారస్తులను బెదరింపులకు గురిచేసేవారని టీడీపీ నేతల
వేధింపులు తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు. కానీ
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నివిధాలా ప్రోత్సాహాన్ని అందిస్తూ బాసటగా
నిలుస్తోందన్నారు. కోవిద్ కష్ట కాలంలోనూ వ్యాపారస్తులను ఆదుకునేందుకు ఈ
ప్రభుత్వం ముందుకొచ్చిందని, ఆ సమయంలో హైదరాబాద్ లో దాక్కున్న టీడీపీ నేతలకు
మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. వ్యాపారస్తులపై నారాలోకేష్ ది
కపట ప్రేమ అని మల్లాది విష్ణు విమర్శించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన
చంద్రబాబు వ్యాపార, వాణిజ్య రంగాలకు చేసింది శూన్యమని ఆరోపించారు. కనుక
తెలుగుదేశం నాయకుల బూటకపు మాటలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో
డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి,
నాయకులు మార్తి చంద్రమౌళి, తుంపాల వరప్రసాద్, గడియారం కామేశ్వరరావు, కొట్టు
కృష్ణ, సామంతకూరి దుర్గారావు, వానపాల రమేష్, అరవింద్, పవన్, నారాయణరెడ్డి,
ప్రసాద్, మనోహర్, మణికంఠ, డి.దుర్గారావు, అన్ని శాఖల అధికారులు, సచివాలయ
సిబ్బంది పాల్గొన్నారు.దాసరి నాగేంద్ర కుమార్ అధ్యక్షత వహించారు.