పురందేశ్వరికి ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగించడంపై రెండు రకాల చర్చలు
అమరావతి : పురందేశ్వరికి బీజేపీ ప్రాధాన్యం ఇవ్వటంపై రెండు రకాల చర్చలు
కొనసాగుతున్నాయి. టీడీపీని దగ్గర చేసుకునే క్రమంలో ఇదో ప్రయత్నంగా అత్యధికులు
భావిస్తున్నారు. కాగా కమ్మ సామాజికవర్గం ప్రధానంగా టీడీపీ శ్రేణుల్లో అయోమయ
స్థితిని కల్పించి వైసీపీకి ఉపయోగపడేందుకే బీజేపీ పురందేశ్వరికి పదవిని
ఇచ్చిందన్న అనుమానాలు వ్యక్తం చేసేవారు లేకపోలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో
విస్తృత రాజకీయ, వ్యక్తిగత స్నేహ సంబంధాలున్న కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి
పురందేశ్వరి బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులు కావటం చర్చనీయాంశంగా
మారింది. ఆమె నియామకాన్ని బీజేపీ అధికారికంగా ప్రకటించగా ఉమ్మడి ప్రకాశం
జిల్లాలోని రాజకీయ నాయకులు, ప్రజానీకం ఇదే అంశంపై విశ్లేషణలు చేసుకోవటం
ప్రస్ఫుటంగా కనిపించింది. ఎన్టీఆర్ కుమార్తెగా గుర్తింపు ఉన్నా డాక్టరు
దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణిగా ఆమె ఉమ్మడి జిల్లాలో సుపరిచితురాలు.
ఎన్టీఆర్ మరణాంతరం దగ్గుబాటి సతీమణిగా 2004లో ఆమె ప్రత్యక్ష రాజకీయ
రంగప్రవేశం చేశారు. 2004 ఎన్నికల్లో పర్చూరు అసెంబ్లీ నుంచి వెంకటేశ్వరరావు,
బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి
గెలుపొందారు. 2009 ఎన్నికల నాటికి బాపట్ల ఎస్సీ రిజర్వ్ కావటంతో పురందేశ్వరి
విశాఖపట్నం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి లోక్‌సభకు మరోసారి
గెలుపొందారు. ఆ సమయంలోనే ఆమెకు కేంద్రమంత్రిగా కూడా అవకాశం దక్కింది.
2009లో వైఎస్సార్ ఆకస్మిక మరణం, రాష్ట్ర విభజన సందర్భంగా చోటు చేసుకున్న
పరిణామాల్లో పురందేశ్వరి, అలాగే వెంకటేశ్వరరావు కూడా కాంగ్రెస్‌లోనే
కొనసాగారు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయంగా సైలెంట్‌గా ఉన్న పురందేశ్వరి 2014లో
బీజేపీలో చేరారు. రాజంపేటలో లోక్‌సభ స్థానానికి పోటీచేసి ఓడినప్పటికీ ఆ
పార్టీలోనే కొనసాగుతూ మోదీ నుంచి ముఖ్యనాయకులందరి మద్దతును పొందగలిగారు. తొలుత
బీజేపీలో చేరిన దగ్గుబాటి కొంతకాలానికి రాజకీయంగా సైలెంట్ అయ్యారు.
జగన్మోహన్రెడ్డి ఆహ్వానంతో 2019 ఎన్నికలకు ముందు వెంకటేశ్వరరావు వైసీపీలో
చేరి పర్చూరు నుంచి పోటీచేశారు. అయినా పురందేశ్వరి బీజేపీలోనే కొనసాగారు. ఆ
ఎన్నికల్లో ఓటమి చవిచూసిన దగ్గుబాటి ఏడాదిన్నర తిరగకుండానే వైసీపీ నుంచి బయటకు
రాక తప్పలేదు. ఆ తర్వాత ఆయన రాజకీయంగా సైలెంటైనా పార్టీలో పదవులు, అధికారిక
పదవులు రాకపోయినా పురందేశ్వరి బీజేపీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర
నిర్వహిస్తూ వచ్చారు.
అభిమానుల్లో రెండు రకాల చర్చలు : కాగా 2004కు ముందు నుంచి టీడీపీతోను,
ముఖ్యంగా చంద్రబాబునాయుడుతో దగ్గుబాటి కుటుంబానికి పూర్తిగా సంబంధాలు
దెబ్బతిన్నాయి. అయితే వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తాజాగా చోటు చేసుకున్న
కొన్ని ఘటనలతో తిరిగి కుటుంబపరంగా సాన్నిహిత్యం పెరిగింది. ఇటు బాబుతోను,
ఎన్టీఆర్ కుటుంబంతోను వీరికి తిరిగి సఖ్యత ప్రారంభమైన నేపథ్యంలో అనూహ్యంగా
పురందేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. కాగా ఉమ్మడి ప్రకాశం
జిల్లాలో దగ్గుబాటి కుటుంబానికి సన్నిహితులైన వారు అన్ని ప్రధాన పార్టీలలో
ఉన్నారు. మరీ ముఖ్యంగా టీడీపీలో అత్యధికంగా ఉన్నారు. వైసీపీలోను లేకపోలేదు. ఇక
ఉమ్మడి జిల్లాలో బీజేపీ ప్రభావం తక్కువే అయినప్పటికీ ఆ పార్టీలో ఉన్న
వారందరిలోను పురందేశ్వరి పట్ల గౌరవాభిమానాలు అధికంగా ఉన్నాయి. దీంతో ఆమె
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించటం పట్ల ఉమ్మడి ప్రకాశం జిల్లాలో
సానుకూలత వ్యక్తమవుతోంది. అయితే సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో
బీజేపీ మద్దతు టీడీపీకా, వైసీపీకా అనే అనుమానాలు ఉన్నాయి. ఈ సమయంలో
పురందేశ్వరికి బీజేపీ ప్రాధాన్యం ఇవ్వటంపై రెండు రకాల చర్చలు కొనసాగుతున్నాయి.
టీడీపీని దగ్గర చేసుకునే క్రమంలో ఇదో ప్రయత్నంగా అత్యధికులు భావిస్తున్నారు.
కాగా కమ్మ సామాజికవర్గం ప్రధానంగా టీడీపీ శ్రేణుల్లో అయోమయ స్థితిని కల్పించి
వైసీపీకి ఉపయోగపడేందుకే బీజేపీ పురందేశ్వరికి పదవిని ఇచ్చిందన్న అనుమానాలు
వ్యక్తం చేసేవారు లేకపోలేదు. దీంతో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు
చేసుకున్నా దగ్గుబాటి కుటుంబానికి గౌరవప్రదమైన పదవి దక్కటం పట్ల మాత్రం ఉమ్మడి
ప్రకాశం జిల్లాలో సానుకూలత వ్యక్తమవుతోంది.