వెలగపూడి : రాష్ట్రంలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందించడానికి ఆధార్
తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. పథకాల అమలులో పారదర్శకత
కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆధార్ చట్టంలోని
నిబంధనలను సవరించింది. ప్రభుత్వం అందించే ఆర్థిక ప్రయోజనాలు, రాయితీలు, సేవలు
పొందడానికి ఆధార్ కచ్చితంగా అనుసంధానం చేయాలి. ఆధార్ లేని వారిని గుర్తించి
దరఖాస్తులు తీసుకోవాలి. అప్పటి వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో వారికి ప్రభుత్వ
పథకాలు అందించాలి. ఆధార్ లేదన్న కారణాన్ని చూపి లబ్ధిదారులకు ఇవ్వాల్సిన
పథకాలు తిరస్కరించకూడదు. దరఖాస్తు చేసుకున్న 3 నెలల్లో ఆధార్ నంబరు
కేటాయించి, వారికి అందే పథకాలకు అనుసంధానం చేయాలని ప్రభుత్వం పేర్కొంది.