ప్రజాకంటక పాలనకు విముక్తి గోదావరి జిల్లాల నుంచే ప్రారంభిద్దాం
వారాహి విజయ యాత్ర కమిటీలతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్
గుంటూరు : వారాహి విజయ యాత్రను దిగ్విజయం చేసేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ
అంతర్గత కమిటీల సభ్యులు చేసిన కృషి, పడిన కష్టం కళ్లారా చూశాను. ఈ పోరాటం వృథా
కాదు..రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైన ముద్ర వేస్తుందని
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. యాత్ర నిర్వహణకు ఏర్పాటు చేసిన
కమిటీలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. యాత్ర తొలి విడతను విజయవంతం చేయడంలో
భాగమైన కమిటీలకు కృతజ్ఞతలు తెలిపారు. క్యాటరింగ్ కమిటీ, వాలంటీర్ కమిటీ,
అకామిడేషన్ కమిటీ, మెడికల్ కమిటీ, మీడియా కోఆర్డినేషన్ కమిటీ సభ్యులను పేరు
పేరున పలకరిస్తూ ధన్యవాదాలు తెలిపారు. శనివారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో
నిర్వహించిన ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “వారాహి విజయ యాత్ర కోసం
నియమించిన ప్రతి కమిటీ క్షేత్రస్థాయిలో ఎంతో శ్రమకోర్చి పని చేసింది. మీ అందరి
కృషి, సహకారాలతోనే తొలి విడత విజయవంతంగా ముగించగలిగాం. ఆదివారం నుంచి ప్రారంభం
కానున్న మలి విడత యాత్రను కూడా ఇదే పట్టుదలతో మనందరం కలిసి విజయవంతం చేద్దాం.
వారాహి విజయయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే ఈసారి సార్వత్రిక
ఎన్నికల్లో జనసేన పాదముద్ర బలంగా ఉంటుందని అర్ధమైంది.
గోదావరి జిల్లాల నుంచే వైసీపీ పతనం
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చూడాలంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచే
వైసీపీ పతనం ప్రారంభం కావాలి. ఇక్కడ ప్రారంభమైతే అది రాష్ట్రవ్యాప్తంగా
విస్తరిస్తుంది. ప్రజాకంటక పాలన విముక్తి చేయడానికి మనం ఎంత బలంగా ముందుకు
వెళితే రాష్ట్రానికి అంత మేలు. మీ కష్టం మరిచిపోలేనిది. భవిష్యత్తులో మీ
కష్టానికి తగ్గ గుర్తింపు ఉంటుందన్నారు.
వారాహి యాత్ర ఒక స్ఫూర్తిదాయక ప్రస్థానం : నాదెండ్ల మనోహర్
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వారాహి
యాత్ర ఒక స్ఫూర్తిదాయక ప్రస్థానం. అంతా కలసికట్టుగా పార్టీ కోసం ఒక చక్కటి
కార్యక్రమం చేసుకోగలిగాం. ప్రతి కమిటీ ఎంతో ఒత్తిడిలోనూ వాలంటరీగా కష్టపడి
యాత్ర విజయానికి సహకరించారు. ప్రతి ఒక్కరు ఒక యంత్రంలా రాత్రింబవళ్లు కృషి
చేశారు. అంతా అద్భుతంగా సహాయ సహకారాలు అందించారు. మరింత బాధ్యత ముందుకు
వెళ్దాం. అంతా అద్భుతంగా సహకరించారు. కలసికట్టుగా ముందుకు వెళ్లి పవన్ కళ్యాణ్
అడుగు పెట్టిన ప్రతి చోటా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా
కోరుకుంటున్నానన్నారు.