అమరావతి : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి నేడు. ఈ
సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా
ఆయనను స్మరిస్తూ ట్వీట్ చేశారు. దీనిపై వైఎస్సార్టీపీ అధినేత్రి, వైఎస్
కూతురు షర్మిల స్పందించారు. రాహుల్‌కు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్‌ను
గుండెలో పెట్టుకున్నందుకు థాంక్స్ చెప్పారు. ‘‘దివంగత ముఖ్యమంత్రి డాక్టర్
వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ మీ
ఆప్యాయతతో కూడిన మాటలకు థాంక్యూ రాహుల్ గాంధీగారూ. మీ నాయకత్వంలో ఈ దేశానికి
ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నమ్మి తెలుగు ప్రజల సేవలో మరణించిన నిబద్ధత కలిగిన
కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ వైఎస్సార్. ఆయన సంక్షేమాన్నే ప్రస్తుతం దేశమంతా
అవలంబిస్తోంది. డాక్టర్ వైఎస్సార్ మీ గుండెల్లో చిరస్థాయిగా నిలిచినందుకు
ధన్యవాదాలు సర్’’ అని షర్మిల ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్
పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి
గారి జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అభ్యున్నతి కోసం
తన జీవితాన్ని అంకితం చేసిన దార్శనికత కలిగిన నాయకుడు. ఎప్పటికీ
గుర్తుంచుకోదగిన వ్యక్తి’’ అని రాహుల్ ట్విటర్ వేదికగా తెలిపారు.