ఈ విషయంలో భారత్ ప్రతిష్ఠ దెబ్బదీసేందుకు పాశ్చాత్య మీడియా తప్పుడు కథనాలు
భారత్-అమెరికా సంబంధాల బలోపేతంలో ప్రవాసభారతీయుల కృషి అమోఘం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వృద్ధి ఇంజిన్ భారత్
భారత పూర్వ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
వాషింగ్టన్ డీసీలో ప్రవాసభారతీయులను ఉద్దేశించి ప్రసంగం
అమరావతి : చాలా దేశాలతో పోలిస్తే భారతదేశంలో మైనారిటీలు సురక్షితంగా ఉన్నారని,
మెరుగైన రక్షణతో పాటు గొప్ప స్వేచ్ఛను అనుభవిస్తున్నారని భారత పూర్వ
ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. పాశ్చాత్య మీడియాలోని
కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వకంగా భారతదేశ ప్రతిష్ఠ దెబ్బతీసే ఉద్దేశంతో
వాస్తవాలను తప్పుగా చిత్రీకరిస్తూ తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నాయని
విమర్శించారు. భారతదేశ పురోగతి, వృద్ధి, ప్రపంచ వేదికపై పెరుగుతున్న
పలుకుబడిని జీర్ణించుకోలేని శక్తులు ఈ నకిలీ కథనాలను పెద్ద ఎత్తున ప్రచారం
చేస్తున్నాయని వెంకయ్య నాయుడు అన్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ప్రవాసభారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన
సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అవాస్తవాలు, అర్ధ-సత్యాలతో వండివారుస్తున్న
ఈ తప్పుడు కథనాలను సమర్థంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. వేల సంవత్సరాలుగా
భిన్న విశ్వాసాలు, భిన్న ఆచారాలు, భిన్న సంప్రదాయాలకు భారతదేశం సామరస్యపూర్వక
నిలయంగా ఉందన్న వాస్తవాన్ని, ఈ విషయంలో భారత్ కు ఉన్న నిష్కళంకమైన ట్రాక్
రికార్డ్‌ను అమెరికాలోని ప్రవాసభారతీయులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న
ప్రవాసభారతీయులు బలంగా ప్రదర్శించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యానికి
మాతృమూర్తి లాంటి భారత దేశం, పాశ్చాత్య ప్రాంతంలో అతిపెద్ద ప్రజాస్వామ్య
దేశమైన అమెరికా మధ్య వివిధ అంశాల్లో లోతైన సంబంధాలకు రెండు దేశాలూ నమ్మే
విలువలే ప్రాతిపదిక అని చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా అమెరికా వృద్ధి పయనానికి
ప్రవాస భారతీయులు విశేషంగా కృషి
చేశారని అభినందించారు. ‘‘మీ నాయకత్వ నైపుణ్యాలతో రెండు గొప్ప దేశాల మధ్య
సంబంధాలను బలోపేతం చేశారు. వాణిజ్య సంబంధాలు మెరుగుపర్చడంలో, పెట్టుబడులు
పెట్టడంలో, విజ్ఞానం పంచుకోవడంలో మీ కృషి ప్రశంసనీయం. మీ సమష్టి కృషితో భారత
దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిపెట్టడంతో పాటు భారత్-అమెరికా సంబంధాలను
పెద్ద ఎత్తున బలోపేతం చేశారు. ’’ అని అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర
మోడీ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి చేసిన
ప్రసంగాన్ని వెంకయ్యనాయుడు ప్రస్తావించారు, “మనం కలిసి పని చేస్తోంది కేవలం
విధానాల రూపకల్పనకు, ఒప్పందాలను కుదుర్చుకోవడానికి మాత్రమే కాదు, మనం
జీవితాలకు సరైన రూపునిస్తున్నాం. కలలను సాకారం చేస్తున్నాం. సరైన గమ్యాన్ని
ఏర్పరుస్తున్నాం.” అని ప్రధాని మోదీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో, ఇతర సంస్థలు, వ్యాపారాల్లో ప్రవాసభారతీయులు తమ
కష్టపడేతత్వంతో ఎంతటి ఉన్నత శిఖరాలకు చేరుకోగలరో ప్రపంచానికి చూపించారని
వెంకయ్య నాయుడు ప్రశంసించారు. ‘‘మైక్రోసాఫ్ట్-సత్యనాదెళ్ల కావచ్చు,
గూగుల్-సుందర్ పిచాయ్ కావచ్చు, ఐబీఎం అరవింద్ క్రిష్ణ కావచ్చు..
ప్రవాసభారతీయులు సీఈఓలుగా ఉన్న బహుళ జాతి సంస్థలు అమెరికాలో చాలా ఉన్నాయి.
అమెరికాలో ప్రవాసభారతీయుల విజయానికి వీరు ఉదాహరణ.’’ అని చెప్పారు.
అమెరికాలో భారతీయ వైద్యులు ఆరోగ్య సంరక్షణకు అమూల్యమైన కృషి చేశారని,
పరిశోధకులుగా, విద్యావేత్తలుగా రాణిస్తున్నారని వెంకయ్య నాయుడు అన్నారు.
‘‘ప్రవాస భారతీయులు అన్ని రంగాల్లోనూ తమ సేవల ద్వారా భారత మాత గర్వపడేలా
చేశారని చెప్పారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్‌ను వృద్ధి ఇంజిన్‌గా శ్రీ వెంకయ్యనాయుడు
అభివర్ణించారు. భారతదేశం నేడు ప్రపంచంలో ఒక ప్రధాన శక్తి అని, ప్రపంచంలో ఐదవ
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పారు. “మరో దశాబ్దం నాటికి భారత్
మూడో అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి సిద్ధంగా ఉంది ఊహించిన
దాని కంటే ముందుగానే 5 ట్రిలియన్ల మార్కును అధిగమించడానికి సిద్ధంగా ఉంది.
భారతదేశం ప్రధాన తయారీ కేంద్రంగా రూపాంతరం చెందింది. మొబైల్ ఫోన్ల తయారీలో
ప్రపంచంలోనే రెండో స్థానంలో, మొబైల్ డేటా వినియోగంలో మూడవ స్థానంలో ఉంది.
వందకు పైగా యూనికార్న్ కంపెనీలతో 98,000 కంటే ఎక్కువ డిపీఐఐటీ గుర్తింపు
పొందిన అంకుర సంస్థలతో, అంకుర పరిశ్రమల ప్రోత్సాహవ్యవస్థలో ప్రపంచవ్యాప్తంగా
మూడో స్థానంలో ఉందని వెంకయ్య నాయుడు చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని కూడా కట్టడి
చేయగలిగిందన్నారు
గత తొమ్మిదేళ్లలో భారతదేశం అభివృద్ధి పథాన్ని వెంకయ్య నాయుడు వివరిస్తూ
2021-2022 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 84.84
బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించిందని చెప్పారు. 2014
నుండి విభిన్న రంగాలలో ఎఫ్‌డిఐ విధానాన్ని సరళీకృతం చేసిన దానికి ప్రతిఫలితం
ఇది అని తెలిపారు. అదే విధంగా, డిజిటల్ చెల్లింపులను భారత ప్రభుత్వం
ప్రోత్సహించడం కారణంగా రికార్డు స్థాయిలో 2022 డిసెంబరులో రూ. 12.8 లక్షల
కోట్ల విలువైన 782 కోట్ల UPI లావాదేవీలు జరిగాయి అని వెల్లడించారు. “2014
నుంచి అన్ని రంగాలలో భారత్ వృద్ధి పథంలో ఇవి కొన్ని ముఖ్యాంశాలు మాత్రమే,” అని
వెంకయ్య నాయుడు అన్నారు. “గత తొమ్మిదేళ్ల వృద్ధి పయనంలో ప్రజా భాగస్వామ్యం,
సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అనేవి ప్రధాన సూత్రాలు.’’ అని తెలిపారు.
సమగ్రఅభివృద్ధి సమ్మిళత వృద్ధి ఉండేలా చూడడం భారత పురోగతి చరిత్రలో అంతర్లీన
ప్రాధాన్యాంశం అని వెల్లడించారు. సాంస్కృతిక, సామాజిక రాయబారులుగా ఉన్న
ప్రవాస భారతీయుల పాత్ర ఇప్పుడు భారత ఆర్థిక రాయబారులుగా విస్తరిస్తోందని
వెంకయ్య. నాయుడు చెప్పారు. ‘‘మన మాతృ భూమితో మన సంబంధాలు, మన మాతృ భాష, మన
సంప్రదాయ ప్రాచీన సంస్కృతి చాలా ముఖ్యం. మీరందరూ భారతీయతను నిలుపుకుంటూ మీ
మూలాలకు కట్టుబడి ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందిని చెప్పారు.
రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలయిన భారత్, అమెరికా మధ్య సంబంధాల్లో ఇప్పుడు
కొత్త అధ్యాయం మొదలయిందని శ్రీ వెంకయ్యనాయుడు చెప్పారు. కీలకమైన రక్షణ రంగం
సహా వివిధ రంగాల్లో పరస్పర సహకార, భాగస్వామ్యాలతో రెండు దేశాల మధ్య బంధం
మునుపెన్నడూ లేనంత బలంగా రూపుదిద్దుకుంటోందని చెప్పారు. ‘‘అంతర్జాతీయ
వ్యూహాత్మక అంశాలపై రెండు దేశాల మధ్య
ఇప్పుడు ఆలోచనల మేళవింపు ఉంని వెల్లడించారు. తయారీ రంగంలో కావచ్చు, సాంకేతిక
పరిజ్ఞానం బదలాయింపు కావచ్చు, పారిశ్రామిక సరఫరాల శ్రుంఖలం కావచ్చు, నిఘా
సమాచారం బట్వాడా కావచ్చు. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై భారత్, అమెరికాలు రెండు
బలమైన భాగస్వాములని చెప్పారు.
ప్రవాస భారతీయులు అటు అమెరికాలో ఇటు భారత్ లో ప్రజలకు చేయగలిగన సాయం చేయాలని
వెంకయ్యనాయుడు సూచించారు. ‘‘మీ విజయం.. మీకు, మీ కుటుంబాలకు మాత్రమే ప్రయోజనం
కలిగించడానికి పరిమితం కారాదు. మీ చుట్టు పక్కల ఉన్నవారికి కూడా సహాయపడాలి.
‘‘మార్గదర్శనం, దాత్రుత్వం, భవిష్యత్తు తరాలకు అవకాశాలు కల్పించడం వంటి వాటి
ద్వారా మన విజయాల వారసత్వం కొనసాగుతుందని వెంకయ్యనాయుడు చెప్పారు.