కెసిఆర్, బి ఆర్ ఎస్ పార్టీకి జాతీయ పార్టీగా చెప్పుకునే నైతిక హక్కు
కోల్పోయారు
జీవో నెంబరు 72 పై ఎపీ ప్రభుత్వం న్యాయస్ధానం ఆశ్రయించాలి
అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లు పరిష్కరించాలి
సర్పంచ్ల ఖాతాల్లో తిరిగి నిధులు జమచేయాలి
విజయవాడ : తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యార్థులకు హక్కుగా
సంక్రమించిన 15 శాతం కన్వీసర్ కోటా సీట్లకు అడ్మిషన్లు ఇవ్వకుండా చేసిన
అన్యాయంపై ఎపి ప్రభుత్వం తక్షణం న్యాయస్ధానాన్ని ఆశ్రయించాలని బీజేపీ రాష్ట్ర
ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే
ఆంధ్రప్రదేశ్‌లోని సర్పంచుల ఖాతాల నుంచి మళ్లించుకున్న కేంద్ర నిధులను తక్షణం
వారి ఖాతాల్లో తిరిగి జమచేయాలని, తమ న్యాయమైన కోర్కెల కోసం ఉద్యమిస్తోన్న
అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్‌ను వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు. బీజేపీ
రాష్ట్ర కార్యాలయంలో విష్ణువర్ధనరెడ్డి బీజేపీ ఎన్టిఆర్ జిల్లా ఇన్‌ఛార్జి
నరసింహారావు, యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీంద్రారెడ్డి లతో కలసి
బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు.
విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఎంబీబీఎస్ సీట్ల
కేటాయింపుపై ఏకపక్షంగా తీసుకువచ్చిన జీవో నెంబరు 72 ఆంధ్రప్రదేశ్ వైద్య
విద్యార్థులకు అన్యాయం చేసేలా ఉందని విమర్శించారు. రాష్ట్ర పునర్విభజన చట్టం
2014లో ఉన్నత విద్యాసంస్థల్లోని 15 శాతం అన్‌రిజర్వుడు సీట్లలో పదేళ్ల పాటు
ఇరు రాష్ట్రాల విద్యార్థులకు కన్వీనర్ కోటాలో సీట్లు కేటాయింపు అంశం
ఉందన్నారు. కాని కేసిఆర్ రాజకీయ దురుద్దేశంతో ఎపీ విద్యార్థులకు అన్యాయం
చేసేలా సీట్లన్నీ 100 శాతం తెలంగాణా విద్యార్థులకే దక్కేలా జీవో 72
తెచ్చారన్నారు. దీనిపై రాష్ట్ర విద్యార్థులు పోరాడుతుంటే కనీసం ఎపీ ప్రభుత్వం
ఏమాత్రం స్పందించలేదన్నారు. కేసీఆర్‌తో అత్యంత సన్నిహితంగా ఉండే జగన్ ఈ
విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. తెలంగాణలోని ఎపీ ఆస్తులు ఏకపక్షంగా
ఇచ్చేసిన జగన్ మనకు దక్కాల్సిన ఆస్తులు, అంశాలపై ఎందుకు నోరు మెదపడం
లేదన్నారు. జగన్మోహనరెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌తో కలసి ఎపి వైద్య
విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఇది ఖచ్చితంగా రాష్ట్ర
ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమన్నారు. తమది జాతీయ పార్టీగా అభివర్ణించుకుంటూ,
ఎదగాలనుకుంటున్న కేసిఆర్ సంకుచిత బుద్ది, నిజస్వరూపం రాజకీయ పార్టీలకు
తెలిసిందని, ఏ ముఖం పెట్టుకుని ఆయన రాజకీయం చేస్తారని ప్రశ్నించారు. వెంటనే
ఎపి ప్రభుత్వం జీవో నెంబరు 72 విషయంలో న్యాయం స్థానాన్ని ఆశ్రయించాలని
డిమాండ్ చేశారు.
అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలి
రెండు రోజులుగా ఉద్యమిస్తోన్న అంగన్వాడీ కార్యకర్తల కోర్కెలు తక్షణం
పరిష్కరించాలని విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు
అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను వైసీపీ ప్రభుత్వం చెత్తబుట్టలో
వేసిందన్నారు. వారి నెల జీతాన్ని కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి సంక్షేమ
పథకాలు అందకుండా చేసి వారిలో తీవ్ర అసంతృప్తిని కలుగచేసినట్లు ఆరోపించారు.
తక్షణం వారితో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సర్పంచ్ల ఖాతాల్లో తిరిగి నిధులు జమచేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి సర్పంచ్ల ఖాతాల నుంచి దారి
మళ్లించుకున్న కేంద్ర నిధులను తక్షణం వారి ఖాతాల్లో జమచేయాలని
విష్ణువర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గ్రామీణాభివృద్ధి కోసం పంచాయతీరాజ్
చట్టం ద్వారా కేంద్ర ప్రభుత్వం సర్పంచ్ల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమచేస్తే
వాటిని తమ అవసరాలకు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించుకోవడం గత నాలుగేళ్లుగా
జరుగుతోందన్నారు. దీంతో తాగునీరు, పారిశుధ్యం, కరెంటు, రహదార్లు వంటి
మౌలికసదుపాయాలు అందుబాటులోకి రాక గ్రామాల్లో సమస్యలు పెరిగిపోయి సర్పంచ్‌లు
తీవ్ర వత్తిడికి లోనువుతున్నారన్నారు. గ్రామంలోని ఒక్క అభివృద్ధి పనిని
చేయలేక, ఒక్క సమస్యని పరిష్కరించుకోలేక సర్పంచ్‌లు ప్రజల ముందు తలెత్తుకోలేని
పరిస్థితుల్లో ఉన్నారన్నారు. సర్పంచ్‌లు తమ పార్టీకి చెందినవారే అని
చెప్పుకునే వైసీపీ వారికి తీరని అన్యాయం చేస్తోందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలే
ప్రజాప్రతినిధులు కాదని, సర్పంచ్‌లు కూడా ప్రజాప్రతినిధులే అంటూ వారికి
హక్కులున్నాయనే విషయాన్ని వైకాపా గుర్తించాలన్నారు.
అధ్యక్షులుగా పురందేశ్వరి బాధ్యతల స్వీకరణ
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులైన దగ్గుబాటి పురందేశ్వరికి
విష్ణువర్ధనరెడ్డి అభినందనలు తెలియచేశారు. పురందేశ్వరి గురువారం
అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపడతారని చెప్పారు. పురందేశ్వరి గురువారం ఉదయం 9.230
గంటలకు విమానంలో గన్నవరం చేరుకుని ర్యాలీగా పార్టీ కార్యాలయానికి
చేరుకుంటారన్నారు. 11 గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారు. 12 గంటలకు వెన్యూ
ఫంక్షన్ హాల్లో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మాజీ అధ్యక్షులు,
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు లాంఛనంగా బాధ్యతలు
అప్పగిస్తారు.
మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్‌రెడ్డి,
జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి సునిల్ డియోధర్, మాజీ
మంత్రి బీజేపీ నాయకులు సిఎం రమేష్, రాజ్యసభ సభ్యులు జీవిఎల్ నరసింహారావు,
మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు,
ఉపాధ్యక్షులు, నాయకులు పాల్గొంటారన్నారు. పురందేశ్వరి గారి నాయకత్వంలో పార్టీ
ముందుకెళ్తుందన్నారు. అనుభవజ్ఞురాలైన నాయకురాలిగా వారి సేవలో పార్టీ ప్రజలకు
మరింత దగ్గరౌతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని రాష్ట్రానికి
చేస్తున్న సహకారాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్తామన్నారు.
16న రాష్ట్ర పదాధికారుల సమావేశం
త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాబోయే 10 నెలల్లో పార్టీ
కార్యకలాపాలపై రాజకీయ కార్యాచరణ నిర్ణయం చేసేందుకు భాజపా రాష్ట్ర పదాధికారుల
ముఖ్యల సమావేశం ఈ నెల 16న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరుగుతుందన్నారు. ఈ
కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జి
వి. మురళీధరన్, బీజేపీ జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్‌జీ
పాల్గొంటారన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు,
వివిధ మోర్చాల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌ఛార్జులు పాల్గొంటారని
చెప్పారు.