రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
ఎస్సారెస్పీ వరద కాలువ తూముల నుండి చెరువులకు నీటిని మళ్లించే పైప్ లైన్లకు
ప్రారంభోత్సవాలు
హర్షాతిరేకాలు వెలిబుచ్చిన రైతన్నలు
కాళేశ్వరం జలాల సాధనతో జన్మ సార్థకమయ్యిందని మంత్రి వేముల భావోద్వేగం
బొందిలో ప్రాణం ఉన్నంత వరకు రైతుల మేలు కోసం కృషి చేస్తానని వెల్లడి
కాంగ్రెస్ కు ఓటు వేస్తే రైతులకు అరిగోసనే..మళ్ళీ పాత రోజులే
రైతుకు అన్ని విధాలా అండగా నిలిచి 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చే కేసిఆర్
కావాలా..?
మూడు గంటలు ఇస్తామన్న కాంగ్రెస్ కావాలా..? రైతుల వ్యవసాయ మోటర్లకు మీటర్లు
పెడతామన్న బీజేపీ కావాలా రైతులే నిర్ణయం చేయాలన్న మంత్రి
నిజామాబాద్ : రైతుల సంక్షేమమే దేశానికి శ్రీరామ రక్ష అని, రైతు బాగుంటేనే
రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల
ప్రశాంత్ రెడ్డి అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా
అన్నదాతలకు ఆలంబనగా నిలుస్తోందని స్పష్టం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని
వేల్పూర్ మండలం అంక్సాపూర్ వద్ద వరద కాలువ తూము నుండి ఊరచెరువు, ధర్మారెడ్డి
చెరువు, బంజనికుంటలకు సాగు నీటిని అందించేందుకు రూ. 29.92 లక్షల వ్యయంతో
నూతనంగా ఏర్పాటు చేసిన పైప్ లైన్, మోర్తాడ్ మండలం దోన్కల్ వద్ద వరద కాలువ
నుండి రాజులు కుంట, పెద్ద చెరువు, మాల కుంట చెరువులకు వరద కాలువ తూము ద్వారా
నీరందించేందుకు రూ. 33 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన పైప్ లైన్లకు
మంత్రి బుధవారం ప్రారంభోత్సవాలు చేశారు. తూముల ద్వారా చెరువుల్లో చేరేందుకు
వడివడిగా పరుగులు తీస్తున్న కాళేశ్వరం జలాలకు రైతులతో కలిసి పూజలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పోరాడి సాధించుకున్న తెలంగాణలో రైతు
అన్నివిధాలా బాగుండాలనే తపనతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు
చేస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న 24గంటల ఉచిత విద్యుత్, పంటల
సాగుకు పెట్టుబడి, సాగునీటి వసతిని చూసి యావత్ దేశం అబ్బురపడుతోందని అన్నారు.
300 కిలోమీటర్ల దూరం నుండి ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా ఎగువకు కాళేశ్వరం
జలాలు రావడం ఎంతో అపురూప ఘట్టమని హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ ప్రాంత
రైతాంగానికి కాళేశ్వరం జలాలు అందించడంతో తన జన్మ సార్థకమైందని మంత్రి వేముల
భావోద్వేగానికి లోనయ్యారు. దిగువ నుండి ఎగువకు వందల కిలోమీటర్ల దూరం నుండి
నీళ్ళు ఎలా వస్తాయని అనేకమంది అనేకరకాలుగా అనుమానాలు వెలిబుచ్చారని అన్నారు.
అయితే రైతుల ప్రయోజనాలే పరమావధిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో పట్టుదలతో రివర్స్
పంపింగ్ పథకాన్ని పూర్తి చేయించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపారని, రైతుల
పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని అన్నారు.
ఎస్సారెస్పీ లోకి వచ్చి చేరుతున్న కాళేశ్వరం జలాల మహాద్భుత ఘట్టాన్ని
వీక్షించేందుకు ఆయకట్టు రైతులు శ్రీరాంసాగర్ ను సందర్శిస్తూ సాగునీటి బెంగ
తీరిందని ఎంతో సంతోషిస్తున్నారని అన్నారు. రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదని,
రైతాగానికి మేలు చేకూర్చడమే తమ కర్తవ్యమని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే
వరద కాలువకు తూములు ఏర్పాటు చేసి పైప్ లైన్ల ద్వారా కాళేశ్వరం జలాలతో చెరువులు
నింపుతున్నామని తెలిపారు. ఎవరు కూడా రాజకీయాల్లో శాశ్వతంగా ఉండరని, పదవులు
వస్తాయి… పోతాయన్నారు. కానీ రైతును నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన
పనులు, కార్యక్రమాలు పది కాలాల పాటు నిలిచి వారికి ప్రయోజనం చేకూరుస్తాయని
అన్నారు. ఇది తనకెంతో సంతృప్తి కలిగించిందని, అధికారంలో ఉన్నా లేకున్నా తన
చివరి శ్వాస వరకు రైతుల మేలు కోసం కృషి చేస్తూనే ఉంటానని మంత్రి వేముల స్పష్టం
చేశారు. సమైక్య రాష్ట్రంలో సాగు కష్టాలతో రైతులు పడే బాధలు వర్ణనాతీతంగా
ఉండేవని తొమ్మిదేళ్ల క్రితం నాటి సంక్షోభ పరిస్థితులు గుర్తు చేశారు. వేళాపాల
లేని అరకొర విద్యుత్ సరఫరా కారణంగా రైతులు అర్ధరాత్రుళ్ళు నీరు పారించేందుకు
వెళ్లి ప్రమాదాల బారిన పడేవారని, సమీప బంధువుల వేడుకలకు కూడా వెళ్ళే పరిస్థితి
ఉండేది కాదన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో సాగు కష్టాలన్నీ దూరమై
నీటి వసతి, 24గంటల కరెంటు, పెట్టుబడి సాయంతో రైతులు సంతోషంగా పంటలు
పండిస్తున్నారని అన్నారు. సమాజానికి అన్నం పెట్టే అన్నదాతలు వాస్తవాలను
గ్రహించి రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న తమ ప్రభుత్వానికి
మద్దతుగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ కు ఓటు వేస్తే రైతుకు అరిగోసే
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కరెంట్ కష్టాలతో కూడిన పాత రోజులే పునరావృతం
అవుతాయని మంత్రి వేముల అన్నారు. టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవసాయ
రంగానికి మూడు గంటల కరెంటు సరిపోతుందని వ్యాఖ్యానించడమే ఇందుకు నిదర్శమని
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి ఉటంకించారు. వ్యవసాయం గురించి, రైతుల
ఇబ్బందుల గురించి కనీస అవగాహన లేని వారికి అవకాశం కల్పిస్తే నష్టపోయేది
రైతులేనని మంత్రి అన్నారు. సాగు రంగానికి ఉతమందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం
కావాలా లేక కరెంటు కష్టాలు, సాగునీటి సమస్యలను పట్టించుకోని పార్టీలు కావాలా
అన్నది రైతులు తేల్చుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. పది మందికి పట్టెడు
అన్నం పెట్టే తెలంగాణ రైతులు వాస్తవాలను ఆలోచించి దేశమంతటికి ఆదర్శంగా
నిలవాలని, రైతులంతా ఒకే పార్టీ గొడుగు కింద ఐకమత్యం చాటాలని హితవు పలికారు. ఈ
కార్యక్రమాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, పెద్ద
సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.