విజయవాడ సెంట్రల్ : రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహా యజ్ఞంలా కొనసాగుతున్న జగనన్న
సురక్ష కార్యక్రమంతో లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారని ప్లానింగ్ బోర్డు
ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 36 వ డివిజన్
గాంధీనగర్ జింఖానా మైదానంలో బుధవారం నిర్వహించిన సురక్ష శిబిరంలో డిప్యూటీ
మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ బాలిగోవింద్ తో కలిసి ఆయన
పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం పేదలకు
అందిస్తున్న సేవలను వివరించారు. గత ప్రభుత్వంలో సర్టిఫికెట్ల కోసం ప్రభుత్వ
కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేదని గుర్తుచేశారు.
సురక్ష కార్యక్రమం ద్వారా అటువంటి సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన విప్లవాత్మకమైన ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు
ఉచితంగా 11 రకాల సేవలు అందుతున్నట్లు చెప్పారు. ప్రజలకు అవసరమైన కుల, ఆదాయ,
జనన, మరణ, వివాహ, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, రైస్ కార్డు తదితర ధ్రువీకరణ
పత్రాలను ఎటువంటి రుసుం లేకుండా అందజేయడం జరుగుతోందన్నారు. సరైన అవగాహన లేక
మిగిలిపోయిన లబ్ధిదారులు, ఇతర సమస్యలతో ధ్రువపత్రాలను పొందలేని ప్రజలకు సురక్ష
కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోందని మల్లాది విష్ణు అన్నారు. శిబిరం ద్వారా
డివిజన్లలో 628 మందికి కుల., 460 మందికి ఆదాయ పత్రాలతో పాటు వివిధ రకాల సేవల
కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు 1,435 ధ్రువీకరణ పత్రాలను ఉచితంగా
అందజేస్తున్నట్లు చెప్పారు. ఏ ఒక్క అర్జీ కూడా పునరావృతం కాకుండా అధికారులు
ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో సెంట్రల్
ఎమ్మార్వో శ్రీనివాస్ వెన్నెల, స్పెషల్ ఆఫీసర్ రామకోటేశ్వరరావు, అన్ని శాఖల
అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.