59 వ డివిజన్ 254 వ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ : పేదల ఆర్థికాభివృద్ధే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఆ
దిశగా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని
ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 59 వ
డివిజన్ 254 వ వార్డు సచివాలయ పరిధిలో గురువారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం
కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానాతో కలిసి ఆయన
పాల్గొన్నారు. గంగానమ్మ గుడి దగ్గర నుంచి పాదయాత్ర ప్రారంభించి జోరు వానలోనూ
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగారు. 250 గడపలను సందర్శించి
ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులకు ప్రజల నుంచి ఆత్మీయ
స్వాగతం లభించింది. తమ ఇంటికి విచ్చేసిన ఎమ్మెల్యేని ప్రజలు సాదరంగా
ఆహ్వానించి ఆప్యాయంగా పలకరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న
సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు పేదల ఉన్నతికి ఎంతగానో దోహద పడుతున్నాయని
మల్లాది విష్ణు అన్నారు. అలాగే ప్రతి సచివాలయానికి ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి రూ. 20 లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్లో
ఇప్పటివరకు 74 వార్డు సచివాలయాల పరిధిలో గడప గడపకు కార్యక్రమాన్ని దిగ్విజయంగా
పూర్తిచేసుకోగా.. 70 పనులకు సంబంధించి రూ. 14 కోట్ల నిధులు మంజూరైనట్లు
వెల్లడించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
టీడీపీ హయాంలో వందిమాగదుల కోసమే కేబినెట్ నిర్ణయాలు
తెలుగుదేశం హయాంలో కేబినెట్ నిర్ణయాలు కేవలం అనుయాయులు, వందిమాగదులకు
దోచిపెట్టడం కోసమే జరిగేవని మల్లాది విష్ణు విమర్శించారు. ఈ ప్రభుత్వంలో ప్రతి
ఒక్క నిర్ణయం కూడా లక్షలాది మంది పేదలకు మేలు చేకూర్చే విధంగా తీసుకోవడం
జరుగుతోందన్నారు. 54 వేల ఎకరాలను భూమిలేని దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన
46,935 మంది నిరుపేదలకు పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం
శుభపరిణామమన్నారు. లంచాలకు అలవాటుపడి, నిండా అవినీతిలో కూరుకుపోయిన గత
తెలుగుదేశం పాలకులు ఇటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోయినందుకు సిగ్గుపడాలన్నారు.
అర్చకులకు నో రిటైర్డెంట్ నిర్ణయం హర్షణీయం
అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చట్ట సవరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం
హర్షణీయమని మల్లాది విష్ణు అన్నారు. పేద అర్చకుల ప్రతి ఒక్క న్యాయబద్ధమైన
డిమాండ్లను ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరిస్తోందని చెప్పారు. కానీ
తెలుగుదేశం నాయకులు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ
హయాంలో అర్చకులకు వంశపారపర్యమైన హక్కులు కల్పించమంటే గొంతెమ్మ కోర్కెలు
కోరవద్దని ఆనాడు చంద్రబాబు అవమానించారని గుర్తుచేశారు. బ్రాహ్మణ కార్పొరేషన్
ను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద అర్చక, పురోహితుల గొంతు కోశారని ఆరోపించారు.
మరలా ఏ ముఖం పెట్టుకుని టీడీపీ నాయకులు మాట్లాడతారని ధ్వజమెత్తారు. వైఎస్
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బ్రాహ్మణులపై తనకున్న అభిమానాన్ని
చాటుకున్నారని మల్లాది విష్ణు అన్నారు. అర్చకుల వంశపారంపర్యంపై నాడు వైఎస్
రాజశేఖరరెడ్డి తెచ్చిన జీవోను సవరించి అమల్లోకి తెచ్చారని పేర్కొన్నారు.
టీడీపీ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు హయాంలో బ్రాహ్మణ సామాజిక
వర్గానికి అందించిన సంక్షేమంపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. మరోవైపు వాలంటీర్ల
వ్యవహారంలో పవన్ కళ్యాణ్ కు స్క్రిప్ట్ అందించి చంద్రబాబు చోద్యం
చూస్తున్నారని మల్లాది విష్ణు ఆరోపించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా పవన్
వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీఈ
రామకృష్ణ, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, సీడీఓ జగదీశ్వరి, నాయకులు హఫీజుల్లా,
నందెపు సురేష్, చింతా శ్రీను, కృష్ణ, కంభగళ్ల రాజు, అమిత్, షేక్ వెంకట్, షఫీ,
నేరెళ్ల శివ, నాయక్, నాగలక్ష్మి, బాబా, అఫ్జల్ భాష, షేక్ జిలాని, అన్ని శాఖల
అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.