విజయవాడ : నూతనంగా ఏర్పాటు చేస్తున్న మూడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు
సర్వహంగులు కల్పించే క్రమంలో రూ. 119.57 కోట్లు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి
జగన్ మోహన్ రెడ్డి అంగీకరించారని నైపుణ్యాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి
సురేష్ కుమార్ తెలిపారు. జీతాలు వంటి పునరావృత వ్యయం రూపంలో సంవత్సరానికి రూ.
24.02 కోట్లు, శాశ్వత భవనాలు, హాస్టళ్లు, యంత్రాలు, పరికరాల కోసం రూ. 95.55
కోట్లు వ్యయం చేయనున్నామన్నారు. బేతంచెర్ల, గుంతకల్, మైదుకూరులో పాలిటెక్నిక్
కాలేజీలకు 128 టీచింగ్, 68 నాన్ టీచింగ్ పోస్టుల మంజూరు అయ్యాయన్నారు. ఒకే
లోకేషన్లో ఉన్న పాలిటెక్నిక్, ఐటీఐలను ఇంటిగ్రేట్ చేయాలని ప్రభుత్వం
నిర్ణయించిందన్నారు. దశలవారిగా జిల్లాకు ఒకటి చొప్పున 26 స్కిల్
డెవలప్మెంట్ కాలేజీలు, 175 పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటు గ్రీన్ సిగ్నెల్
ఇచ్చారన్నారు. విద్యా సంస్థల్లో పూర్తిస్థాయి బోధన సిబ్బంది నియామకంతో పాటు,
సాంకేతిక విద్యావిధానంలో మార్పులకు అనుగుణంగా కోర్సులు ఉండాలని
నిర్ణయించినట్లు సురేష్ కుమార్ పేర్కొన్నారు. సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు
చదలవాడ నాగరాణి మాట్లాడుతూ నంద్యాల జిల్లా బేతంచెర్ల ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో
మెకానికల్ లో 60, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లో 60, ఎలక్ట్రానిక్స్
కమ్యూనికేషన్ లో 60, ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్‌లో 60 సీట్లు
నిర్ధేశించామన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో
మెకానికల్ లో 60, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ లో 60 సివిల్ లో 60, ఎలక్ట్రికల్
ఇంజినీరింగ్, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీలో 60 సీట్లు ఉంటాయన్నారు.
వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ లో మెకానికల్ లో 60,
ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ లో 60, సివిల్ లో 60, కెమికల్ లో 60,
మెటలర్జికల్ లో 60, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లో 60
సీట్లు ఉంటాయని నాగరాణి వివరించారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన వర్క్ ఫోర్స్
ఆవశ్యకత ఎంతో ఉందని, ఉపాధి సృష్టి, మార్కెట్ ఆధారిత కోర్సులను ప్రవేశపెట్టడం
వంటి అంశాలు భవిష్యత్తులో కీలక భూమిక పోషిస్తాయని సురేష్ కుమార్ వివరించారు.
సాంకేతిక విద్యా సంస్థల ఏర్పాటుతోనే ఇది సాధ్యమవుతుందన్నారు. గ్రామీణ యువతలో
సాంకేతిక నైపుణ్యం పెంపొందించేలా వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి కొత్త
టెక్నికల్ కోర్సులతో పాటు నూతన సంస్థలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నూతన
ప్రభుత్వ పాలిటెక్నిక్‌ల స్థాపన కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనం చేసామని,
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజల సామాజిక-ఆర్థిక అంశాలను పరిగణనలోకి
తీసుకుని పూర్తి స్ధాయి నివేదిక ప్రకారం కొత్త కళాశాలల ఏర్పాటు జరిగిందని
స్పష్టం చేశారు.