కాపులకు కూడా కాపు నేస్తం వంటి సంక్షేమ పథకాలు అమలు
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అంబటి రాంబాబు
నెల్లూరు : అన్ని వర్గాలతో పాటు కాపుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత
ప్రాధాన్యతనిస్తుందని, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి కాపుల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ
మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆదివారం
నెల్లూరు ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయ సమీపంలో రూ. 6.15 కోట్ల తో నూతనంగా
నిర్మించిన కాపు భవన్ ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి
మంత్రి అంబటి రాంబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో
అత్యధిక సంఖ్య గల కాపులకు కూడా కాపు నేస్తం వంటి సంక్షేమ పథకాలను అమలు చేసిన
ఘనత ముఖ్యమంత్రి కే దక్కిందని చెప్పారు. రాజకీయ పదవుల్లో కూడా కాపులకు
ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, కాపుల సంక్షేమం కోసం ఆలోచన
చేస్తున్న ముఖ్యమంత్రిని ప్రతి ఒక్కరూ ప్రేమించాలని, అండగా నిలవాలని
పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం శంకుస్థాపన చేసిన కాపు భవనానికి తమ ప్రభుత్వం
నిధులు కేటాయించి ప్రారంభించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ
చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ఆలోచన చేస్తున్న
ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని పునరుద్గాటించారు. రాష్ట్రంలో అతి
పెద్ద సామాజిక వర్గం కాపు సామాజిక వర్గమని, దక్షిణ భారతదేశంలో కాపు సామాజిక
వర్గం బాగా విస్తరించిందని, ఈ సామాజిక వర్గం సంక్షేమానికి కూడా ముఖ్యమంత్రి
పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు.
కాపులు అంటే దేశ సంరక్షణకు కాపు కాసేవారని, వివాదాలకు దూరంగా ఉంటారని,
పరిపాలన, వ్యాపారం, వ్యవసాయం రంగాల్లో రాణిస్తూ, సమాజంలో ఏకతాటిపై ఉంటూ
అందరినీ కలుపుకొని ముందుకెళ్తారన్నారు. కాపులందరూ ఐకమత్యంగా నెల్లూరు జిల్లాలో
కాపు భవన్ ను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి
చెప్పారు. కాపు భవన్ మరింత అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని,
అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి నిధులు కూడా మంజూరయ్యేలా కృషి చేస్తామని
మంత్రి స్పష్టం చేశారు. అలాగే జిల్లాలో బీసీ భవన్ ఏర్పాటుకు కూడా చర్యలు
తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.
రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు మాట్లాడుతూ కాపు భవన్ లో భోజనశాల ఏర్పాటుకు
రూ. 50 లక్షలు ఎంపీ నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. నెల్లూరు జిల్లా
కాపుల చిరకాల కోరిక అయిన కాపు భవన్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా
ఉందన్నారు. ఈ భవన నిర్మాణానికి ఎంతమంది దాతలు సాయం చేశారని చెప్పారు.
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా, అన్ని సామాజిక వర్గాలకు తలమానికంగా కాపులు
ఉండడం, వారి ఐక్యతకు నిదర్శనం అన్నారు. అలాగే జిల్లాలో బీసీ భవన్ ఏర్పాటుకు
కూడా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్
రెడ్డి మాట్లాడుతూ కాపు భవనం ఏర్పాటుకు ప్రభుత్వం ఉదారంగా మూడు ఎకరాల
స్థలాన్ని కేటాయించిందని, అందమైన భవనాన్ని నిర్మించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
గత ప్రభుత్వంలో మాజీ మంత్రి నారాయణ ఈ భవన నిర్మాణానికి రూ కోటి రూపాయలు
విరాళంగా ఇచ్చారని, వారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నట్లు ఆదాల
చెప్పారు. భవిష్యత్తులో ఈ భవనం అందరికీ ఉపయోగపడేలా మౌలిక వసతుల కల్పనకు కృషి
చేస్తామని చెప్పారు.
తొలుత కాపు భవన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రజా ప్రతినిధులకు స్థానిక
నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కాపు భవన్ ప్రారంభోత్సవ శిలా
ఫలకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ ఆనం
అరుణమ్మ, కలెక్టర్ ఎం హరినారాయణన్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వికాస్,
కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరిబాబు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి
వెంకటయ్య, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, ఆనం విజయ్ కుమార్
రెడ్డి, సన్నపురెడ్డి పెంచల రెడ్డి, కార్పొరేటర్ విజయలక్ష్మి, జిల్లా కాపు సంఘ
నాయకులు పిండి సురేష్, సిరి శ్రీనివాస్, భూపతి విజయ, రాఘవ, ఆహ్వాన కమిటీ
సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.