తిరుమల : శ్రీవారి ఆలయంలో సోమవారం సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహించనున్నట్లు
టీటీడీ ఆలయ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. పుష్పపల్లకిపై శ్రీదేవి, భూదేవి
సమేతంగా శ్రీనివాసుడు రేపు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని తెలిపారు. ఆణివార
ఆస్థానం నిర్వహిస్తున్నందున సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు.
దీంతో నేడు వీఐపీ సిఫారసు లేఖలను అనుమతించరు. శ్రీవాణి ట్రస్టుపై కొందరు చేసే
తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఈవో ధర్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. శ్రీవాణి
ట్రస్టు ద్వారా ఇప్పటికే 9 లక్షల మంది దర్శనం చేసుకున్నట్లు తెలిపారు.
శ్రీవాణి ట్రస్టుపై మరో ఆరోపణ వచ్చింది. కావాల్సిన వారికి ఆలయాలు నిర్మాణ
కాంట్రాక్ట్ ఇస్తున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. జీర్ణోద్ధరణలో భాగంగానే
పార్వేట మండపం నిర్మాణం జరుగుతుంది. పార్వేట మండపాన్ని కూల్చివేశామని తప్పుడు
ప్రచారం చేస్తున్నారని ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ బస్సుల్లో చెత్త కుండీలు : మరోవైపు, వసతి సముదాయాల డిపాజిట్లు 7
రోజుల్లో భక్తుల ఖాతాల్లో జమ అవుతాయని ఈవో తెలిపారు. భక్తుల ఖాతాల్లో
డిపాజిట్లు జమ కాకపోతే టీటీడీని సంప్రదించాలని సూచించారు. కాలినడక మార్గంలో
చిరుత దాడిలో గాయపడిన కౌశిక్ కోలుకున్నాడన్నారు. రాత్రి వేళ గాలిగోపురం నుంచి
వచ్చే భక్తులు గోవింద నామస్మరణతో గుంపుగా రావాలన్నారు. ఘాట్ రోడ్డులో
ప్లాస్టిక్ వ్యర్థాలతో వన్యప్రాణులకు హాని కలుగుతోందని చెప్పారు. అందుకే
వ్యర్థాలు వేసేందుకు ఆర్టీసీ బస్సుల్లో చెత్త కుండీలు ఏర్పాటు చేయనున్నట్లు
ఈవో తెలిపారు.
రూ. 116.14 కోట్ల ఆదాయం: తిరుమల శ్రీవారిని జూన్ నెలలో 23 లక్షల మంది భక్తులు
దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ. 116.14 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ
తెలిపింది. 1.6 కోట్ల లడ్డులను భక్తులకు విక్రయించినట్లు పేర్కొంది. మొత్తం
10.80 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, 24.38 లక్షల మంది అన్నప్రసాదం
స్వీకరించారు.