తెలుగు, ఇంగ్లిష్ టైప్ రైటింగ్ పరీక్షలకు ఇక స్వస్తి
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
వెలగపూడి : కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగంలో చేరినవారికి రాష్ట్ర ప్రభుత్వం
శుభవార్త తెలిపింది. కారుణ్య నియామకం కింద టైపిస్ట్, ఎల్డీ టైపిస్ట్, యూడీ
టైపిస్ట్, టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగాలు పొందినవారు కంప్యూటర్ పరీక్ష
పాసైతే వారి సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు
అనుగుణంగా కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగంలో చేరినవారు ఇక నుంచి తెలుగు,
ఇంగ్లిష్ టైప్ రైటింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనకు స్వస్తి
చెబుతూ సాధారణ పరిపాలన శాఖ (సర్వీసెస్) కార్యదర్శి పోలా భాస్కర్ ఉత్తర్వులు
జారీ చేశారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన ఉద్యోగులు రెండేళ్లలోపు
కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే వారి సర్వీసును
క్రమబద్ధీకరించనున్నట్లు స్పష్టంచేశారు. ఈ మేరకు గత నిబంధనలను సడలించినట్లు
తెలిపారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర సచివాలయ విభాగాలు, శాఖాధిపతులు, జిల్లా
కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో సూచించారు.
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు : రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
కె.వెంకటరామిరెడ్డి
ఎంతోకాలంగా ఇబ్బందిపడుతున్న కారుణ్య నియామక ఉద్యోగుల సమస్యను పరిష్కరించిన
ముఖ్యమంత్రి వై. స్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు
రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకటరామిరెడ్డి ఒక ప్రకటనలో
తెలిపారు. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ ప్రకారం కారుణ్య నియామకం కింద టైపిస్ట్,
స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు పొందినవారు తెలుగు, ఇంగ్లిష్ టైప్ రైటింగ్
టెస్ట్ పాస్ అయితేనే వారి సర్వీసు రెగ్యులర్ చేసేవారని, టైపింగ్‌కు
ప్రాధాన్యత తగ్గిపోవడంతో అది నేర్పించేవారు లేక, ఆ పరీక్ష పాస్ కాలేక
చాలామంది ఉద్యోగులు సంవత్సరాల తరబడి రెగ్యులర్ కాక ఇబ్బందులు పడుతున్న
విషయాన్ని తాము సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ
మేరకు ప్రభుత్వం కారుణ్య నియామకం ద్వారా విధుల్లో చేరిన ఉద్యోగులకు తెలుగు,
ఇంగ్లిష్ టైప్ రైటింగ్ పరీక్షల నుంచి మినహాయింపు ఇచ్చిందని వివరించారు.