ఎంబీబీఎస్, బీడీఎస్ ఫీజులు ఖరారు
ఎంబీబీఎస్ కన్వనర్ కోటాకు రూ.16,500…బీ కేటగిరికి రూ.13.20 లక్షలు…సీ
కేటగిరికి రూ.39.60 లక్షలు
గుంటూరు : 2023–24 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రైవేట్ వైద్య,
డెంటల్ కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు ఫీజులు ఖరారు చేస్తూ
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు
ఉత్తర్వులిచ్చారు. హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఫీజుల అమలు ఉంటుందని
పేర్కొన్నారు. 2022–23లో అమలైన ఫీజులపై 10% మేర పెంపుదల చేసి కొత్త ఫీజులను
ఖరారు చేశారు. ఎంబీబీఎస్ కన్వనర్ కోటా ఫీజును రూ.16,500గా నిర్ణయించారు. బీ
కేటగిరికి రూ.13.20 లక్షలు, సీ కేటగిరి (ఎన్ఆర్ఐ కోటా)కు రూ.39.60 లక్షలు
చొప్పున ఫీజులు ఉన్నాయి. బీడీఎస్ కన్వనర్ కోటాకి రూ.14.300..బీ కేటగిరీకి
రూ.4.40 లక్షలు, ఎన్ఆర్ఐ కోటాకి రూ.13.20 లక్షలు చొప్పున ఫీజు ఖరారు చేశారు.
2020లో ఖరారు చేసిన ఫీజుల ప్రకారం 2022–23 విద్యా సంవత్సరం వరకు ప్రవేశాలు
చేపట్టారు. నీట్ యూజీ–2023లో ఏపీలో 42,836 మంది విద్యార్థులు అర్హత
సాధించారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు డాక్టర్ వైఎస్సార్
ఆరోగ్య వర్సిటీ ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. నీట్ యూజీ అర్హత సాధించినవారు
దరఖాస్తు చేసుకుంటున్నారు.
వ్యాయామ కళాశాలల్లో కోర్సులకు ఇలా : ప్రైవేట్, అన్–ఎయిడెడ్ వ్యాయామ
కళాశాలల్లో డీపీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ కోర్సులకు ఉన్నత విద్య నియంత్రణ,
పర్యవేక్షణ కమిషన్ సిఫారసుల మేరకు 2023–26 విద్యా సంవ్సతరానికి ఫీజులను
ప్రభుత్వం ఖరారు చేసింది. కన్వనర్ కోటా కింద రెండేళ్ల కోర్సుల్లో భాగంగా
డిప్లొమో (డీపీఈడీ)కు రూ.14 వేల నుంచి రూ.16 వేలు, బ్యాచ్లర్ (బీపీఈడీ)కు
రూ.15 వేల నుంచి రూ.24,500, మాస్టర్స్ (ఎంపీఈడీ)కు రూ.25 వేల నుంచి రూ.35 వేల
మధ్య ఆయా కళాశాలల్లోని వసతులు, విద్యా బోధనను బట్టి ఫీజులను నిర్ణయించింది.
ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోని ఒక కళాశాలతో పాటు, గత అడ్మిషన్లలో 25% కంటే
తక్కువ నమోదైన 5 కళాశాలలకు అడ్మిషన్లను 2023–26 విద్యా సంవత్సరానికి బ్లాక్
చేసినట్లు ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వులిచ్చారు.