నిర్వాసితులకు అమలు చేయాల్సిన పునరావాసం పై దృష్టి
పోలవరం ప్రాజెక్టు సహా ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులపై సిఎస్ డా.కె.ఎస్.జవహర్
రెడ్డి సమీక్ష
వెలగపూడి : రాష్ట్రంలోని పోలవరం ప్రాజెక్టు సహా ఇతర ప్రాధాన్య ప్రాజెక్టుల
నిర్మాణాల ప్రగతిపై బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు.
ముఖ్యంగా ప్రాజెక్టుల వారీ ఇప్పటి వరకూ పూర్తి చేసిన పనుల ప్రగతి, ఇంకా పూర్తి
చేయాల్సిన పనులు, నిర్వాసితులకు అమలు చేయాల్సిన పునరావాస ప్రాజెక్టులు తదితర
అంశాలపై ఆయన సమీక్షించారు. ముందుగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన
పనులు,పునరావాస ఫ్యాకేజికి సంబంధించి ఇప్పటి వరకూ చేపట్టిన పనులను సిఎస్
సమీక్షించారు. నిర్దేశిత గడువు ప్రకారం పనులు పూర్తి చేసేందుకు తగిన చర్యలు
తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
అనంతరం ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులపై సమీక్షిస్తూ పూల సుబ్బయ్య వెలిగొండ
ప్రాజెక్టు, ఔకు టన్నల్,గొట్టా బ్యారేజి నుండి హీర మండలం ఇరిగేషన్
ప్రాజెక్టు,వంశధార-నాగావళి నదుల అనుసంధానం-గొట్టా బ్యారేజి రిజర్వాయర్
ప్రాజెక్టు,హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్-2 తదితర ప్రాజెక్టుల ప్రగతిని ప్రభుత్వ ప్రధాన
కార్యదర్శి డా.జవహర్ రెడ్డి జలవనరుల శాఖ అధికారులతో సమీక్షించారు.ఈ 5
ప్రాజెక్టులను ఈఏడాదిలో పూర్తి చేసి ప్రారంభించేందుకు వీలుగా తగిన చర్యలు
తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.అంతకు ముందు ఆయా ప్రాజెక్టుల వారీ
ఇప్పటి వరకూ విడుదలైన నిధులు, ఖర్చు చేసిన మొత్తం పూర్తి చేసిన పనులు,
ప్రాజెక్టుల నిర్వాసితులకు అమలు చేస్తున్న పునరావాస ప్యాకేజికి సంబంధించిన
ప్రగతిని సిఎస్ సమీక్షించారు.
అంతకు ముందు రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పోలవరం
ప్రాజెక్టు సహా ఇతర ప్రాధాన్య ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటి వరకూ జరిగన పనుల
ప్రగతని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈసమావేశంలో రాష్ట్ర
ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్,జల వనరుల శాఖ ముఖ్య
కార్యదర్శి శశి భూషణ్ కుమార్,ఆర్ అండ్ ఆర్ కమీషనర్ సి.శ్రీధర్,
ఇంజనీర్-ఇన్-చీఫ్ లు సి.నారాయణ రెడ్డి, సతీష్ కుమార్,చీఫ్ ఇంజనీర్లు సుధాకర్
బాబు, కబీర్ భాషా, మురళీ నాధ్ రెడ్డి, వెంకటరమణ, శ్రీనివాస రెడ్డి, సుగుణాకర్
రావు, హరి నారాయణ రెడ్డి, ఆర్ అండ్ ఆర్ అధికారి పవన్ ఆదిత్య, ఎస్ఇలు తదితరులు
పాల్గొన్నారు.