స్థలాల కేటాయింపుకు జీవో విడుదల చేయాలి
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టులకు రాష్ట్ర
ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆరోగ్య బీమా కార్డును అమలు చేయాలని
రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే ఐజేయు ఉపాధ్యక్షుడు కటకం సుభాష్ డిమాండ్
చేశారు. టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు గురువారం ఎల్బీనగర్ లో
పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు పలువురు జర్నలిస్టులు
ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉత్తరాలు రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని
ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పర్యాయాలు బహిరంగ ప్రకటన చేసినప్పటికీ అమలుకు
నోచుకోవడం లేదన్నారు. సొంత నివాసాలు లేక వేలాదిమంది జర్నలిస్టులు అద్దెలు
చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని అనారోగ్యంతో ఉన్న పేద జర్నలిస్టులకు
ఆరోగ్య బీమా కార్డులను అందజేసి ఉచిత వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు
తీసుకోవాలని పోస్ట్ కార్డు ద్వారా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఇళ్ల స్థలాల
కేటాయింపు విషయమై రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేసి పాత్రికేయులకు
న్యాయం చేయాలని పోస్ట్ కార్డులో వివరించారు. జర్నలిస్టుల సమస్యలను వివరిస్తూ
రాసిన పోస్ట్ కార్డులను ప్రగతిభవంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కు పంపించడం
జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు టి. శ్రీనివాసరావు, బానాల మధుసూదన్,
ఎస్.రాజు, గట్ల రవీంద్ర, మట్టా అశోక్ గౌడ్, భగవంతురావు తదితరులు పాల్గొన్నారు.